కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?

Nizamabad Constituency Internal Clash Arvind Dharmapuri BJP Politics - Sakshi

పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ?

ఎంపీ వర్సెస్‌ కన్వీనర్లు
ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం.

చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్‌)

నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..!
బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్‌పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్‌కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్‌కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కారులో పెరిగిన కసి
ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు.  అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్‌ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది.

పైగా  రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

- పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top