దేశంలో మరో కొత్త పార్టీ.. నవజ్యోత్ కౌర్ సిద్ధూ ప్రకటన | Navjot Kaur Sidhu announces new political party | Sakshi
Sakshi News home page

దేశంలో మరో కొత్త పార్టీ.. నవజ్యోత్ కౌర్ సిద్ధూ ప్రకటన

Apr 7 2026 9:07 AM | Updated on Apr 7 2026 9:20 AM

Navjot Kaur Sidhu announces new political party

చండీగఢ్‌: కాంగ్రెస్ బహిష్కృత నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధూ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. పంజాబ్‌ మాజీ మంత్రి, క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ భార్యనే నవజ్యోత్ కౌర్ సిద్ధూ. ఆమె బీజేపీలో చేరవచ్చని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, భారతీయ రాష్ట‍్రవాది పార్టీ (బీఆర్‌పీ)ని స్థాపిస్తున్నట్లు ఓ ఫొటో ద్వారా వెల్లడించారు. పార్టీ పేరుతో ఉన్న ఫొటోతో పాటు ఆమె ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

ఎంతోకాలంగా ఈ ప్రకటన చేయాలని ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఆలోచన కొంతకాలంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల పనితీరును సమీక్షించిన తర్వాత కొత్త ప్రత్యామ్నాయ పార్టీ అవసరమనిపించిందని తెలిపారు.

తన కొత్త పార్టీ ప్రజాసేవ, న్యాయం, బాధ్యతల నిర్వహణపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలకు నిజంగా ఏం కావాలో దాన్ని తిరిగి అందించడం లక్ష్యమని, దేశంపై బాధ్యతా భావంతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఒకే లక్ష్యంతో శాంతి, న్యాయం కోసం అ‍న్ని రాష్ట్రాల వ్యాప్తంగా కలిసి పనిచేయడానికి నమ్మకంతో చేరారని తెలిపారు.

పంజాబ్ కోల్పోయిన కీర్తిపై దృష్టి పెడతా..
పంజాబ్‌ కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురావడం, ప్రేమ, స్వేచ్ఛ, నిస్వార్థ సేవ వంటి విలువలపై ఆధారపడి రాష్ట్రాన్ని “సువర్ణ రాష్ట్రం”గా మార్చడమే లక్ష్యమని నవజ్యోత్ కౌర్ సిద్ధూ చెప్పారు. ప్రజలతో, ప్రజల కోసం అనే విధంగా ప్రభుత్వాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పాటు పౌరుల్లో ఆధ్యాత్మిక వికాసం వంటివి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. 

ఉన్నత చైతన్యంతో పని చేయడం, సత్యం, ప్రేమ మార్గంలో నడవడం గురించి ఆమె చెప్పారు. గాయపడిన ప్రజల మనసులను నయం చేయడంపై ఈ ఉద్యమం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఆమె చేసిన ఈ ప్రకటనలో స్పష్టత అంతగా లేదు. పార్టీ నిర్మాణం, నాయకత్వం, అధికారికంగా పార్టీని ప్రారంభించేది ఎప్పుడు? వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement