హేమంత్ సొరెన్‌పై సొంత ఎమ్మెల్యే విమర్శలు | Sakshi
Sakshi News home page

హేమంత్ సొరెన్‌పై సొంత ఎమ్మెల్యే విమర్శలు

Published Sun, Feb 4 2024 4:50 PM

MLA Big Remarks On Hemant Soren Ahead Of Jharkhand Majority Test - Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో నూతనంగా సీఎం పదవి చేపట్టిన చంపయ్ సొరెన్ రేపు బలప్రదర్శన నిరూపించుకోవాల్సి ఉంది. ఈ కీలక సమయాల్లో జేఎంఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే మాజీ సీఎం హేమంత్ సొరెన్‌పై విమర్శలు చేయడం, ప్రస్తుతం సీఎం చంపయ్ సొరెన్ మద్దతుకు మరో ఎమ్మెల్యే దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపు జరగబోయే ఫ్లోర్ టెస్టుకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఈ పరిణామాలు జార్ఖండ్‌లో నాయకత్వ మార్పుల ముప్పు తొలగిపోలేదని గుర్తుచేస్తున్నాయి. 

సాహిబ్‌గంజ్ జిల్లాలోని బోరియో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోబిన్ హెంబ్రోమ్ ఒక రాజకీయేతర సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికలకు ముందు జేఎంఎం మేనిఫెస్టోలో చోటా నాగ్‌పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల అద్దె చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదు. 1996 కేంద్ర  పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేదు.
 
చోటానాగ్‌పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల చట్టాలు గిరిజనుల భూమి హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ఉండగా.. కేంద్ర గ్రామ పంచాయతీ చట్టం గిరిజనులను దోపిడీ నుండి రక్షించడానికి గ్రామసభకు అధికారం ఇస్తుంది.  ఈ చట్టాలు అమలైతే గిరిజనుల భూములకు రక్షణ ఉంటుంది. 
 

చెప్పినా పట్టించుకోలేదు..
గిరిజన సంక్షేమం విషయంలో జేఎంఎం నుండి అన్ని సంబంధాలను తెంచుకుంటానని లోబిన్ హెంబ్రోమ్ హెచ్చరించారు. శిబు సోరెన్‌ ఆధ్వర్యంలో ఎంతో పోరాటం చేస్తే జార్ఖండ్‌ ఏర్పడింది, కానీ నేటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఈ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. విమానాశ్రయం, ఆనకట్టలు, పరిశ్రమల పేరుతో గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని హెంబ్రోమ్ ఆరోపించారు. జార్ఖండ్‌లో గిరిజనేతరుల పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రతీ విషయంలో బిహారీలు కల్పించుకుంటారు..  హేమంత్ సొరెన్‌కు తాను చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. 

బిషున్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే చమ్ర లిండా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ పరీక్షకు ముందు జరిగిన పార్టీ సమావేశాలకు లిండా గైర్హాజరయ్యారు. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య ఈ అంశాలపై స్పందించారు. హెంబ్రోమ్‌తో మాట్లాడామని తెలిపారు. రేపు జరగబోయే ఫ్లోర్ టెస్ట్ కి ఆయన కూడా వస్తారని  చెప్పారు. చమ్ర లిండా అనారోగ్యంతో ఉన్నారని వివరించారు.  

ఇదీ చదవండి: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

 
Advertisement
 
Advertisement