‘సినీ’ సమస్యలకు కారకుడు బాబే

Minister Perni Nani Comments On Chandrababu Naidu Over Cinema Issue - Sakshi

వాటిని పరిష్కరించింది సీఎం వైఎస్‌ జగన్‌ 

దీనిపై సినీ పరిశ్రమ హర్షిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు 

మోహన్‌బాబు కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లాను 

ఆయనతో నాకు రెండు దశాబ్దాల పరిచయం 

వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం.. 

సంజాయిషీ ఇవ్వడానికి వెళ్లలేదు 

ఎవరో ట్వీట్‌ చేస్తే నేను సమాధానం చెప్పాలా? 

దీనిపై మీడియాలో దుష్ప్రచారం విచారకరం మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్‌ హయాంలో నాటి సీఎం చంద్రబాబు సినీ పరిశ్రమకు సమస్యలను సృష్టిస్తే.. ఇప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పరిష్కరించారని సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఇటు ప్రజలకు తక్కువ ధరకు వినోదం అందించేలా.. అటు సినీ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చేలా.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకోవడంతో సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఈర్ష్యతో అర్థంపర్థం లేని విమర్శలు జగన్‌పై చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లానని.. సినీనటుడు మోహన్‌బాబు కాఫీకి రావాలని ఆహ్వానిస్తే.. వారి ఇంటికి వెళ్లానని మంత్రి చెప్పారు. రెండు దశాబ్దాల నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉందని.. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం తప్ప.. సినీ ప్రముఖులతో సీఎం నిర్వహించిన సమావేశానికి సంబంధించి సంజాయిషీ ఇచ్చుకోలేదని నాని స్పష్టం చేశారు. అయినా ఎవరి ట్వీట్‌కో తనను సమాధానం చెప్పమంటే ఎలా అని ప్రశ్నించారు.

ఈ అంశంపై మీడియాలో దుష్ప్రచారం చేయడంపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. సీఎంతో జరిగిన సమావేశం వివరాలతో పాటు, ప్రభుత్వం తరఫున సంజాయిషీ ఇచ్చుకోవడానికి తాను మోహన్‌బాబును కలిశానని మీడియాలో జరిగిన ప్రచారం విచారకరమన్నారు. ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉండదన్నారు. నిజానికి సమస్యను సృష్టించింది చంద్రబాబు అయితే, దాన్ని పరిష్కరించింది సీఎం జగన్‌ అని అన్నారు. సినిమా టికెట్ల రేటుపై నిర్ణయం కోసం కమిటీ వేయాలని ఆనాడు హైకోర్టు ఆదేశిస్తే, కమిటీ వేసిన చంద్రబాబు, అధిక టికెట్‌ ధరలతో ప్రజలను దోచుకునే దుçష్ట సంప్రదాయానికి తెరలేపాడని.. దానికి సీఎం జగన్‌ పరిష్కారం చూపించారని నాని తెలిపారు. 

దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట.. 
చంద్రబాబు ప్రతి అంశంలోనూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని నాని ఆరోపించారు. నిజానికి తమకు మంచి జరిగిందని, సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సినీ పరిశ్రమ వర్గాలు చెబితే, చంద్రబాబు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజానికి ఆయన తనకు నచ్చిన వారికి ఒక విధంగా, వేరొకరికి మరో విధంగా పనిచేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ విధంగా వ్యవహరించిందీ దర్శకుడు గుణశేఖర్‌ను అడిగితే చెబుతారని.. అలాగే, చిరంజీవి సినిమాకూ చంద్రబాబు ఎలా ఇబ్బంది పెట్టిందీ ఆయన సోదరుడు చెప్పిన విషయాన్ని నాని గుర్తుచేశారు.

అసలు గురువారం సినీ ప్రముఖుల  సమావేశంలో ఏం జరిగిందో చంద్రబాబుకు ఏం తెలుసునని.. ఆయనేమైనా ప్రభాస్‌ బల్ల కిందో.. మహేష్‌ బల్ల కిందో దూరారా? అని ఎద్దేవా చేశారు. లోపల మాట్లాడిన వారంతా సంతోషం వ్యక్తంచేస్తే, ఓర్వలేక చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. ఇక ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top