లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా.. మరి దొంగ ఓట్లు ఎలా?

Minister Kurasala kannababu Comments On Kuppam Municipal Polls - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గులాబ్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. 'గులాబ్‌ తుఫాను బాధిత రైతులకు పరిహారం ఇచ్చాం. నివర్‌ తుపాను బాధితులకు కూడా అప్పుడే పరిహారం ఇచ్చేశాం. చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్‌ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారు. వారం పదిరోజులుగా జరుగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నాం.

సీఎం జగన్‌ రైతు పక్షపాతి
చంద్రబాబు హయాంలో తన పదవీకాలం పూర్తయ్యేనాటికి కూడా ఇవ్వలేదు. సకాలంలో చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదు. రైతు పక్షపాతి జగన్ ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. త్రిముఖ వ్యూహంతో మేము పనిచేస్తున్నాం. సోము వీర్రాజు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇస్తామన్నదానికంటే ముందుగానే మేము రైతులకు పరిహారం ఇస్తున్నాం. కేంద్రం న్యాయం చేస్తున్నట్టు, రాష్ట్రం చేయనట్లు చెప్తే జనం నమ్మరు. కేంద్రం రైతుల పక్షాన ఉంటే ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?.

చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్‌)

మరి దొంగ ఓట్లు ఎలా వేయగలరు?
కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఓటరు ఐడీ లేకుండా ఓటరు పోలింగ్ బూతులోకి ఎలా వెళ్లగలరు?. చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. లోకేష్ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా?. మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు?. మూడు రాజధానుల విషయమై కోర్టులకు వెళ్లి ఆపాలని చూస్తున్నారు. మూడు రాజధానులు చేయటం మీ తరం కాదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని మీరు ఎందుకు కట్టలేకపోయారు?. చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా నిర్ణయాలను ప్రజలు అంగీకరిస్తున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు సరైన బుద్ది చెప్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కర్నూలే రాజధాని అన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు?' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top