ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్‌లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదు. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది. ఓటమిని విశ్లేషించుకుంటాము. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి?. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టాం. జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదు’ అని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టడం కట్టారు. మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. దేశమంతా ఎస్ఐఆర్ జరగాలి. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు అని ఎద్దేవా చేశారు.


