ఈ నెల 12న ప్రధాని మోదీ సభ దద్ధరిల్లాలి: బండి సంజయ్

Make PM Narendra Modi Rally Huge Success Appeals Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా రామగుండంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జనసమీకరణ చేసి మోదీ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. శనివారం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నేతలతో మోదీ పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ ‘మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ సభకు పెద్దసంఖ్యలో రైతులను తరలించాలి. జన సమీకరణ, సభ విజయవంతానికి జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలి. ముఖ్యంగా రూ.6,120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడంవల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలి’అని నాయకులకు ఆదేశించారు.

మో­దీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదని ప్రజలకు చెప్పాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సోయం బాపూరావు, ఈటల రాజేందర్, జి.వివేక్, జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, ప్రదీప్‌ కుమార్, ఎస్‌.కుమార్,  మనోహర్‌ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

మునుగోడులో గెలుస్తాం: బండి 
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నిక సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఒక ఉపఎన్నిక సీటు గెలిచేందుకు రూ.వేయి కోట్లకు పైగా ఖర్చు చేశారని, మద్యం ఏరులై పారించారని మండిపడ్డారు.

12న ప్రధాని మోదీ రామగుండం సభ ఏర్పాట్లపై శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మునుగోడు అంశం ప్రస్తావనకు రాగా సంజయ్‌ పై విధంగా స్పందించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్‌ కమిషనర్, జిల్లా ఎస్పీ టీఆర్‌ఎస్‌ తొత్తులుగా మారారని ఆరోపించారు. ‘ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్‌లో ఉన్న పోలీస్‌ కమిషనర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా పనిచేశారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారు. ఇన్ని చేసినా ప్రజలు మనవైపే ఉన్నారు’అని సంజయ్‌ తెలిపారు.
చదవండి: జాతీయ బరిలో  బీఆర్‌ఎస్‌.. ‘ఫామ్‌హౌస్‌’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top