లోకేష్‌ కోసం భరత్‌ను టార్గెట్‌ చేశారా? | For Lokesh Does Chandrababu Target Bharat | Sakshi
Sakshi News home page

లోకేష్‌ కోసం భరత్‌ను టార్గెట్‌ చేశారా?

Sep 8 2022 5:50 PM | Updated on Sep 8 2022 6:15 PM

For Lokesh Does Chandrababu Target Bharat - Sakshi

జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితే టీడీపీలో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌కు రానుందా..? లోకేష్ కోసం ఎన్టీఆర్‌ను తొక్కి పెట్టినట్టే ఇప్పుడు భరత్‌ను టార్గెట్‌ చేశారా...? ఉద్దేశ పూర్వకంగానే పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారా? ఇవీ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

తనకు, తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్‌కు పార్టీలో ఎవరైనా అడ్డుపడుతున్నారని భావిస్తే తొక్కి పెట్టడం చంద్రబాబుకు కొత్తేం కాదు. గతంలో తనకు ఎక్కడ అడ్డుపడతారోననే భయంతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పురంధేశ్వరి, బావమరిది హరికృష్ణ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వంటి వారిని తొక్కిపెట్టారు. ఎన్టీఆర్ మరణం తరువాత వారికి పార్టీలో ఉనికి కూడా లేకుండా చేశారు. చివరకు వారంతట వారు పార్టీ నుంచి వెళ్లిపోయేలా స్కెచ్‌ అమలు చేసి సక్సెస్‌ అయ్యారు. 

తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌ది పార్టీలో అదే పరిస్థితి. లోకేష్ ఎదుగుదలకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అడ్డుపడతాడోనని 2009 ఎన్నికల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ను అణగదొక్కడం మొదలెట్టారు. ఇప్పుడా జాబితాలో లోకేష్‌ తోడల్లుడు భరత్‌ చేరడం చర్చనీయాంశమైంది. 

వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని వదిలేస్తారని, యూజ్‌ అండ్‌ త్రో ఆయన పాలసీ అని అంటుంటారు. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఎవరెవరిని ఎలా వాడుకున్నారో.. ఎలా రోడ్డున పడేశారో ఇట్టే తెలిసిపోతుంది. నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పక్కన పెట్టేశారని సన్నిహిత వర్గాలే అంటారు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను వెంట బెట్టుకుని తర్వాత తనదైన శైలిలో పావులు కదిపి వారిని వదిలించుకున్నారు. 

1995 నుంచి 2004 వరకు సీఎం పదవిలో ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను కరివేపాకుల్లా చూశారు. వారు ఎక్కడ తనకు పోటీ అవుతారోనని పాతాళానికి తొక్కిపడేశారు. కానీ 2004లో అధికారం పోయాక మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. 2009లో ఎలాగైన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో.. మహాకూటమిని ఏర్పాటు చేసి జూనియర్‌ ఎన్టీఆర్‌ను చేరదీశారు. పలుచోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేయించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2009 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వరుసగా రెండుసార్లు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 

అలా పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావడంతో... 2014 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తనదైన శైలిలో పావులు కదిపి--- జన్మలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని చెప్పిన పార్టీతోనే జట్టుకట్టారు.  ఓ వైపు మోదీ చరిష్మా.. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను అడ్రస్‌ లేకుండా చేసేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలోనైతే పేరు ఎత్తకుండా తెరవెనక పావులు కదిపేశారు. ఇక బాలకృష్ణ చిన్నల్లుడిగా, ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా భరత్‌కు గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 

విశాఖ సిటీలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచి భరత్‌ ఓటమి పాలవడం వెనక చంద్రబాబు, లోకేష్ కుట్ర దాగి ఉందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దాంతో భరత్ కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. లోకేష్‌తో పోల్చుకుంటే రాజకీయంగా, విద్య, వ్యాపారపరంగా భరత్‌ బెటరనే అనే టాక్‌ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భరత్‌కు రాజకీయంగా అవకాశం కల్పిస్తే బాలకృష్ణ చిన్నల్లుడిగా పార్టీలో ఎక్కడ ప్రభావం చూపుతాడోననే ఆందోళన చంద్రబాబులో ఉందట. అందులో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి సీటు లేకుండా చేయాలనేది ఆయన ఆలోచనట. 

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖపట్నం ఎంపీగా లేదా భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది భరత్‌ మనసులో ఉన్న మాట అని ప్రచారం జరుగుతోంది. దాంతో విశాఖ నగరంలో బీసీలు అధికంగా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు బీసీలకు ఇవ్వాలని చెప్పి భరత్‌ను పక్కన పెట్టాలనే కుట్రకు చంద్రబాబు స్కెచ్‌ రెడీ చేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అటు భీమిలి ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి పార్టీలో ఉంటే గంటా శ్రీనివాసరావుకు లేదంటే ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబుకు సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని అనుకుంటున్నారు. అంటే పార్టీలో కూడా భరత్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చంద్రబాబు ఇప్పటినుంచే  పావులు కదుపుతున్నారనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో విశాఖలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా భరత్‌ కనిపించకపోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోందని పచ్చ పార్టీలోనే చర్చ జరుగుతుండడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement