
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని, భారీమెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యలో ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టు తేల్చగా, తొమ్మిదిన్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసీ నదిలో పడేసినట్లేని, ఆ పార్టీ ఎంపీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం బందీ చేసుకుని అప్పులపాలు చేసిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు.
ఆరు గ్యారంటీల అమలు, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం కోసం వేలాదిమంది సాధుసంతులు, హిందువులు, ప్రజలు ఉద్యమించారని తెలిపారు. కోట్లాదిమంది భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలో సాకారమవుతోందన్నారు.
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, హిందువుల ఆత్మగౌరవానికి అయోధ్య రామమందిరం ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని 150 దేశాల్లోని హిందువులందరూ వర్చువల్‌గా వీక్షించనున్నారని తెలిపారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు.