
బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభం
బేగంపేట స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు రాష్ట్రంలో పలు అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం కాను న్నాయి. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో తాను స్వయంగా పాల్గొన నున్నట్లు పేర్కొన్నారు.
బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడుస్తుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించిందని, ఇది 2014–15 నాటి బడ్జెట్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
