ఇలాంటి గ్యాగ్‌ ఆర్డర్లు ఎప్పుడూ చూడలేదు: కన్నబాబు

Kurasala Kannababu Satirical Comments On Chandrababu - Sakshi

తాడేపల్లి: ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. న్యాయ వ్యవస్థ పై మాకు సంపూర్ణ గౌరవం ఉందని చెప్పారు. కోర్టు తీర్పుల్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో హైకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఆ పేర్లు బయట పెటొద్దని వారిని కాపాడుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాలు ఎక్కడా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రాకూడదని ఆదేశించారు. గతంలో ఎక్కడా కూడా ఇలాంటి కోర్టు ఆర్డర్ రాలేదు. 

కోర్టు తీర్పుపై చర్చ జరుగుతున్న సమయంలో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. జడ్జి కూతుళ్ల పేర్లు ఉంటే బయట పెట్టకూడదా? రేపు వేరే కేసుల్లో కూడా ఇలాంటి తీర్పు ఇస్తారా అని చర్చ జరుగుతోంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి చర్చ మంచిదేనని భావిస్తున్నా. మీడియాపై ఆంక్షలు విధిస్తారా అని కోర్టులు గతంలో ప్రశ్నించాయి. దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ పట్ల చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని శాసన సభ నిర్ణయిస్తుంది. శాసన సభకి కొన్ని హక్కులుంటాయి. మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేయకూడదన్న కోర్టుల జోక్యం పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాలా? 
(చదవండి: పేదవాళ్లు, పెద్దవాళ్ల పక్కన ఉండడానికి అనర్హులా..?)

సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎవరైనా అభినందించాలి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత స్టైరిన్‌ను అక్కడ నుంచి తరలించాలని సీఎం ఆదేశించారు. అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కొందరు మాత్రం. ఎందుకు తరలించారు అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లోనూ మా నాయకులు ఈ అంశం పై మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరిట కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డు పడితే ఎలా? ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా? గత ప్రభుత్వాల నిర్ణయాలు సమీక్షించకపోతే 2జీ స్కాం బయటకు వచ్చేదా? 

రమేష్ హాస్పిటల్ లో మనుషులు చనిపోతే కేసులు పెట్టి విచారణ చేయొద్దా. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మద్య ఏదో జరిగిపోతుందని చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్స్ రాలేదు. సీఎం జగన్ నిర్ణయాలను విమర్శించడమే కొన్ని పత్రికల పనైపోయింది. గతంలో చంద్రబాబు అనేక సార్లు పెట్రోల్‌పై భారం వేశారు. లాక్ డౌన్ సమయంలో కూడా ముఖ్యమంతి​ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.

ఈ సమయంలో రాష్ట్రానికి ఇన్ని నిధులు ఎలా తెస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇసుకపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా విష ప్రచారం చేస్తున్నారు. 16 శాతం వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంక్ పడిపోయిందని చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబుకు సర్వే చేసిన అవే సంస్థలూ.. ఇప్పుడూ సర్వే చేసి ఉంటాయి. ఆ ఓటు బ్యాంక్ అంతా తన వైపునకు మారి ఇప్పుడే సీఎం అయ్యేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు’అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
(చదవండి: డిక్లరేషన్‌పై వివాదం: వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top