సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ అనేది మోసాలకు, కుట్రలకు కేరాఫ్ అని.. ఆ విషయం తెలిసి కూడా నమ్మి తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట ఒక్క హామీ అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ చురకలు అంటించారు.
బుధవారం వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేటితో నయవంచనకు నాలుగేళ్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు పెద్దలు వరంగల్‌కు వచ్చారు. వాళ్లను పెద్దలు అనేకంటే దొంగలు అనొచ్చు. రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు గాలం వేశారు. రైతుల రక్తం తాగిన పార్టీ.. రైతుల నెత్తినకిరీటం పెడతుందని మభ్యపెట్టింది. కాంగ్రెస్ కుట్రలు తెలిసి కూడా ఆ హామీలను నమ్మారు. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక పంపేందుకే ఇవాళ రైతు సంగ్రామ సభ పెట్టాం..
.. రైతుల డిక్లరేషన్ పేరిట లక్షల మంది రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. రెండున్నరేళ్లు గడిచింది. రైతు డిక్లరేషన్ గురించి అడిగితే ఎవరూ మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడున్నావ్?.. రైతు డిక్లరేషన్ ఏమైంది? అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్ గాంధీ ఫొటోలను బస్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్‌లలో అంటించాలి. దాని కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాయలాలి.
కాంగ్రెస్ హయాంలో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో క్రమం తప్పకుండా పథకాలు అందేవి. తెలంగాణ తెచ్చిన రైతు భరోసాను 12 రాష్ట్రాల్లో అమలు చేశారు. 11 విడతల్లో కేసీఆర్ రూ.73 వేల కోట్లు ఇచ్చారు. కానీ, మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ నేతలు చెడ్డీగ్యాంగ్ కంటే డేంజర్..

..రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం. 34 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతులకు నాగలితో దున్నడం తెలుసు.. మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టడమూ తెలుసు. ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి. హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు.


