
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం సరికాదన్నారు. ఇదే సమయంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, బాన్సువాడ బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసం కలిశారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు. సీనియర్ నాయకుడు అని పోచారంను బీఆర్‌ఎస్ ఎంతో గౌరవం ఇచ్చింది. అన్ని రకాలుగా గౌరవించినా పార్టీని వీడటం ఆయనకే నష్టం.
కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించింది. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లు అయినా సరే వదిలి పెట్టేది లేదు. వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.