టార్గెట్‌ 175 దిశగా వైఎస్సార్‌సీపీలో మార్పులు.. టెన్షన్‌లో టీడీపీ! | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 175 దిశగా వైఎస్సార్‌సీపీలో మార్పులు.. టెన్షన్‌లో టీడీపీ!

Published Thu, Dec 14 2023 9:04 AM

KSR Comments Over YSRCP Candidates Change In Assembly Elections - Sakshi

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్దం చేస్తున్నారు. ఆయన దీనిపై కసరత్తు ఆరంభించి, కొన్ని నిర్ణయాలు కూడా అమలు చేశారు. అందులో భాగంగా ఏకంగా పదకొండు మంది శాసనసభ్యులను తప్పించడమో లేక వారికి స్థాన చలనం చేయడమో జరిగింది. ఇది ఒక రకంగా సాహసంతో కూడిన పని అని చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకోసం అభ్యర్ధుల ఎంపికలో అన్ని అంశాలను బెరీజు వేసుకుని ఎంపిక చేస్తుంది. ఇందులో ఎవరు బాగా చేయగలిగితే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేశారని అనుకోవచ్చు.

✍️ఇంతమందిని మార్చినా ఒకటి, అరా తప్ప, ఎక్కడా పెద్దగా అసంతృప్తి ఎదురుకాలేదు. అది ఒక మంచి పరిణామం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కారణం ఏమైనప్పటికీ శాసనసభకు, పార్టీకి రాజీనామా చేయడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా, దాని ప్రభావం ఎన్నికలపై పడకపోవచ్చు. రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కి సన్నిహితుడుగా పేరొందారు. టీడీపీ హయాంలో ఆయన పలు సమస్యలకు గురయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనను ఎంతగా వేధించాలో అంతగా వేధించింది. అయినా ఆయన నిలబడి లోకేష్‌ను ఓడించారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నా సామాజిక  సమీకరణల వల్ల అది సాధ్యం కాలేదు. అయినా రామకృష్ణారెడ్డి ఒకసారి అసెంబ్లీలో తాను జీవితాంతం వైఎస్ జగన్ మద్దతుదారుగానే ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాలలో లేకపోతే వ్యవసాయం చేసుకుంటానని అన్నారు. ఆయనలో కొంత అసంతృప్తి ఉన్నా దానిని ఎక్కడా బహిర్గతం చేయకుండా జాగ్రత్తపడ్డారని చెప్పాలి.

✍️ముఖ్యమంత్రి జగన్‌పై కానీ, పార్టీపైగానీ ఎలాంటి విమర్శలు చేయలేదు. అయినా పార్టీకి రాజీనామా చేసి ఉండాల్సింది కాదు. ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్త బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన వెళ్లి తమ్ముడితో మాట్లాడివచ్చారు. మంగళగిరిలో ఈసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావించింది. తదనుగుణంగా చిరంజీవులు అనే నేతను ఇన్‌ఛార్జీగా నియమించారు. అక్కడ బీసీ వర్గాలకు చెందినవారు అరవైవేల మంది వరకు ఉంటారని అంచనా. బహుశా చిరంజీవులకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై ఎల్లో మీడియా బాగా హడావుడి చేయడానికి యత్నించింది కానీ, రామకృష్ణారెడ్డి బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడంతో వారి కోరిక తీరలేదు. 

✍️అలాగే మరికొన్ని మార్పులు కూడా సీఎం జగన్ చేశారు. వాటిలో నలుగురు మంత్రుల సీట్లను కూడా మార్చడం. వేమూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేరుగ నాగార్జునను ఈసారి సంతనూతలపాడుకు పంపుతున్నారు. చిలకూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యురాలిని చేశారు. మరో మంత్రి ఆదిమూలం సురేష్‌కు ఈసారి ఎర్రగొండపాలెం కాకుండా కొండపి కేటాయించారు. కొండపి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అశోక్ బాబును వేమూరు పంపారు. మాజీ మంత్రి సుచరితకు తాడికొండ బాధ్యత అప్పగించారు. వీటిలో ఎక్కడా పార్టీలో అసంతృప్తులు బహిర్గతం కాలేదు. గాజువాక ఇన్‌ఛార్జీగా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి తనను మార్చినందుకు అలిగినట్లు వార్తలు వచ్చినా, ఆయన సర్దుకుని తాను పార్టీలోనే  కొనసాగుతానని స్పష్టం చేశారు. 

✍️ముఖ్యమంత్రి జగన్ నాలుగు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనే సీట్ల కేటాయింపు, కొందరి మార్పుపై ప్రకటన చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు ఇచ్చి దెబ్బతిన్నారన్న అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే సీఎం జగన్ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేమని చెబుతూ వచ్చారు. ఆ కారణంగానే నలుగురు ఎమ్మెల్యేలు  పార్టీని వీడినా ఆయన సిద్దపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఏభై మంది వరకు మార్చుతారన్న ప్రచారం ఉంది. అభ్యర్ధుల మార్పు అన్నది సర్వేలు, పార్టీలో ఉన్న పరిస్థితి, ప్రత్యర్ది పార్టీ అభ్యర్ది తదితర అంశాల ఆధారంగా నిర్ణయించుకుంటారు.

✍️దీంతో వైఎస్సార్‌సీపీకి ఏదో జరిగిపోతుందని టీడీపీ మీడియా పెద్ద గొంతుతో అరుస్తోంది. అదే కరెక్టు అయితే టీడీపీ ఇప్పటికే అంతం అయిపోయి ఉండాలి. ఆ పార్టీ కూడా ఆయా ఎన్నికలలో కొందరిని మార్చుతూ వస్తోంది. అంతెందుకు ఈసారి కుప్పంలో పోటీ చేయాలా? వద్దా అన్న సందిగ్దతో చంద్రబాబు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయన కుప్పంతో పాటు పెనమలూరు నుంచి కూడా పోటీచేయవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. నిజానికి ఆయన నియోజకవర్గం మారితే టీడీపీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చంద్రబాబు నిజానికి చంద్రగిరికి చెందినవారు. అక్కడ ఒకసారి ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత ఆయన ఓటమి చెందారు. తదుపరి ఆయన తెలివిగా కుప్పంను ఎంచుకుని ఎన్నికవుతున్నారు. 

✍️గుడివాడ సీటుకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కాదని వెనిగళ్ల రాము అనే ఎన్ఆర్ఐకి చంద్రబాబు సీటు ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పోటీచేయాలని ఆసక్తిగా ఉంది. కానీ టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగూర్‌ మీరాలు పోటీ పడుతూ తమకు టిక్కెట్ ఇవ్వకపోతే ప్లాన్-బీ ఉందని పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. దీంతో టీడీపీ పని అయిపోయినట్లేనని ఎల్లో మీడియా అంగీకరిస్తుందా?. మంత్రులు సీట్లు మారడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. అదేమి కొత్తకాదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికి నాలుగు నియోజకవర్గాలు మారారు. మరో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా నాలుగు చోట్ల పోటీచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిది చోట్ల గెలిచారు. తన సొంత నియోజకవర్గం గుడివాడను ఆయన వదలిపెట్టి హిందూపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆయన కుమారులు హరికృష్ణ, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ నుంచే గెలుపొందారు. 

✍️బాలకృష్ణ గుడివాడ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదు? అంటే సమాధానం ఉంటుందా?. రిజర్వుడ్ నియోజకవర్గాలలో మార్చుతారా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెగ బాధపడుతున్నాయి. 2019లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వంగలపూడి అనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు, అప్పటి మంత్రి కెఎస్ జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు మార్చడాన్ని ఏమంటారు?. జవహర్‌కు ఈసారి కూడా తిరువూరు టిక్కెట్టే ఇస్తారా? వీటి గురించి ఈనాడు, జ్యోతి ఎన్నడైనా రాశాయా? వారి అసలు బాధ ఈ నియోజకవర్గాలన్నిటిలో మార్పులు జరిగితే టీడీపీకి గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే!. ఏ రాజకీయ పార్టీ అయిన పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వైఎస్సార్‌సీపీలో కూడా అదే రీతిలో తన ఆలోచన ప్రకారం నిర్ణయిస్తుంది. ఏ పార్టీకైనా కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై  కొంత అసంతృప్తి ఉండవచ్చు. పార్టీలో ఉన్న గ్రూపులు ఇబ్బంది పెడుతుండవచ్చు. 

✍️అంతెందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తుపాను ప్రాంతాల పర్యటనకు వెళ్లి రాజీకీయాలు చేసి వచ్చారు కదా!. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పారు. పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తానని చెప్పారు  తప్ప, ఇన్‌ఛార్జీగా ఉన్నవారికే ఇస్తానని అనలేదు. పైగా ఇన్‌ఛార్జ్‌లను మార్చివేస్తానని కూడా ఆయన చెబుతున్నారు. అంటే టీడీపీ పని అయిపోయినట్లేనని ఎవరైనా విశ్లేషిస్తారా?. అలాగే వైఎస్సార్‌సీపీలో కూడా జరగుతుంది. కానీ, అతి తెలివి మీడియా మాత్రం సీఎం జగన్ పదకొండు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడంపై ఏదో జరిగిపోయినట్లు ఉన్మాదంతో ప్రచారం చేస్తోంది. 

✍️వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్దులపై కన్నా ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న విశ్వాసాన్ని కనబరిచే ఎన్నికలుగా ఉండే అవకాశం అధికంగా  ఉంది. అలా అని ఎమ్మెల్యే అభ్యర్దులకు ప్రాధాన్యత లేదని కాదు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి కనుక ఆయనే కీలకం అవుతారు. ఎమ్మెల్యేల మార్పు వైఎస్సార్‌సీపీ గెలుపునకు మరో సంకేతమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ ఒకసారి నిర్ణయం చేశాక సాధారణంగా వెనక్కి తగ్గడం అంటూ జరగదు. మరో మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి  జగన్ ఈ విషయంలో టీడీపీ కన్నా వేగంగా పార్టీ అభ్యర్ధుల విషయంలో స్పందిస్తున్నారని చెప్పవచ్చు. టీడీపీ, జనసేనలు పొత్తు అని చెబుతున్నప్పటికీ వారు ఏ సీట్లలో పోటీచేస్తారో చెప్పలేని భయం. ఇప్పటికే కొన్ని చోట్ల రెండు పార్టీల వారు కొట్టుకుంటున్నారు. వాటిని కప్పిపుచ్చి, వైఎస్సార్‌సీపీలో లేని సమస్యను సృష్టించి ఏదో సాధించాలన్నది ఎల్లో మీడియా తాపత్రయం. ఆ మాత్రం ప్రజలకు అర్ధం కాదా!. 


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement