ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య సమన్వయంపై సందేహాలు
గెలిచినా ఓడినా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిదే బాధ్యత అన్నట్టుగా పరిస్థితి
ఏపీ ప్రాంతంవారి ఓట్ల కోసం కమలం నేతల ప్రత్యేక వ్యూహాలు
అంతర్గతంగా బీజేపీకి ఎన్డీయే మిత్రులు టీడీపీ, జనసేన మద్దతు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.
కిషన్‌రెడ్డిపైనే భారం..
ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్‌చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్‌రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు.
ఏపీ ప్రాంత ఓట్లకు గాలం...
ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.


