తెచ్చిన వారితో నచ్చిన తీరుతో జనవాణి | Janasena Leader Pawan Kalyan Comments In Janavani | Sakshi
Sakshi News home page

తెచ్చిన వారితో నచ్చిన తీరుతో జనవాణి

Aug 18 2023 5:53 AM | Updated on Aug 18 2023 5:53 AM

Janasena Leader Pawan Kalyan Comments In Janavani - Sakshi

దొండపర్తి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించిన జనవాణి కార్యక్రమం ప్రభుత్వంపై నిందలకే పరిమితమైంది. ఒక్క సమస్యనూ ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. బాధితులకు భరోసా కూడా ఇవ్వలేదు. గురువారం విశాఖలోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమం మొత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా, జనసేన నేతలకు నచ్చిన విధంగా నిర్వహించారు. ముందుగా ఎంపిక చేసి తెచ్చిన వారితోనే వినతులు ఇప్పించారు.

వారి సమస్యలకూ పవన్‌ పరిష్కారం చూపకుండా ప్రతిదానికీ ప్రభుత్వంపై నిందలేశారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన పవన్‌ 11.30కు వచ్చారు. ముందుగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఐదుగురు జనసేన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం కొందరు భూ సమస్యలు వివరించగా.. ఉత్తరాంధ్రలో భూములను వైఎస్సార్‌సీపీ నేతలు దోచుకున్నారంటూ ఏవేవో ఆరోపణలు చేశారు.

తమ కుమార్తె రెండేళ్లుగా కనిపించడంలేదని మడిగట్ల శ్రీనివాస్‌ దంపతులు చెప్పగా.. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించడంలేదని ఇప్పటికే చెప్పానని అన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన తర్వాత వైద్య పరీక్షలు చేయడంలేదని కొందరు చెప్పగా.. ఎల్‌జీ పాలీమర్స్‌ బాధితులకే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్‌.. విశాఖను రాజధాని ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమను ఆదుకోవాలని కొందరు దివ్యాంగులు కోరగా.. మన ప్రభుత్వం వస్తే కూర్చోబెట్టి పోషిస్తానని చెప్పారు.

స్టీల్‌ప్లాంట్‌ అంశం దాటవేత
స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడానికి వచ్చిన స్టీల్‌ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు పవన్‌ ఎటువంటి భరోసా ఇవ్వలేదు. సెయిల్‌లో విలీనం సహా ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చే అంశాలను వారు వివరిస్తుండగానే పవన్‌ అడ్డుకొన్నారు. దీనిపై తరువాత చర్చిద్దామంటూ పంపేశారు.

యూనివర్సిటీల్లో ప్రక్షాళన జరగాలి
యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయడంలేదని కొందరు వినతిపత్రం ఇవ్వగా.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ప్రక్షాళన జరగాలని పవన్‌ అన్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఆంధ్రా వర్సిటీ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంగా మారిపోయిందని, దీనిని హెచ్‌ఆర్‌డీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

గంగవరం పోర్టు జీతాలపై కొందరు కార్మికులు వినతిపత్రం ఇవ్వగా ఈ అంశాన్ని ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివిస్, హెటిరో కంపెనీలపై ఫిర్యాదులు రాగా.. ఉత్తరాంధ్ర కాలుష్యంతో నిండిపోయిందని, ఈ సమస్యను పరిష్కరించలేని జగన్‌.. విశాఖను రాజధానిగా ఏం చేస్తారని విమర్శించారు. అనేక మంది వినతులు ఇచ్చేందుకు వచ్చినప్పటికీ మరోసారి జనవాణి నిర్వహిస్తామని చెప్పి పంపించేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement