
జైపూర్: రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే అయిన తనకు పింఛనును పునరుద్ధరించాలని మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దరఖాస్తు చేసుకున్నారు. కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి 1993–1998 కాలంలో కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఆయన కొనసాగారు. 2019 జూలై వరకు మాజీ ఎమ్మెల్యే పింఛను కూడా అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులవడంతో ఆ పింఛను నిలిచిపోయింది. అనంతరం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2022 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో జూలై 21వ తేదీన రాజీనామా చేయడం తెల్సిందే.
అయితే, నిలిచిపోయిన మాజీ ఎమ్మెల్యే పింఛనును పునరుద్ధరించాలని రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తాజాగా విజ్ఞాపన పంపారని అధికార వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినప్పటికీ నుంచి ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో పింఛను అందించే ప్రక్రియను ప్రారంభించామని వివరించాయి. రాజస్థాన్‌లో ఒక దఫా ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి నెలకు రూ.35 వేల చొప్పున పెన్షన్ అందిస్తారు. అదనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పర్యాయాలు, వయస్సును బట్టి పింఛను మారుతూంటుంది. 70 ఏళ్లు పైబడిన వారికి పింఛనులో 20 శాతం పెంపుదల ఉంటుంది.
ప్రస్తుతం ధన్‌ఖడ్ వయస్సు 74 ఏళ్లు అయినందుకు మాజీ ఎమ్మెల్యే హోదాలో పింఛను నెలకు రూ.42 వేల చొప్పున అందుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు, మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో నెలకు రూ.2 లక్షల వరకు, మాజీ ఎంపీగా నెలకు రూ.31 వేల పింఛను అందుకునేందుకు ఆయన అర్హులని అధికారులు తెలిపారు. 1980ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ధన్‌ఖడ్ 1990ల్లో లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు.