కమలం పార్టీలో లుకలుకలు.. బహిరంగంగానే విమర్శలు

Internal Clashes Among Bjp Cadre Vikarabad - Sakshi

బీజేపీలో అంతర్గత విభేదాలు 

పార్టీ కార్యక్రమాలకు  దూరంగా ఉంటున్న నేతలు 

శ్రేణుల మధ్య సమన్వయ లోపం

జిల్లా అధ్యక్షుడిపై నేరుగా విమర్శలు

బీజేపీ కేడర్‌లో జోష్‌ తగ్గింది.. జిల్లా నేతల తీరుపై పలువురు నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శలు చేయడం శ్రేణుల మధ్య విభేదాలను ఎత్తిచూపుతోంది. పార్టీ కార్యక్రమాలకు నేతలంతా పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం కమలం పార్టీలో లుకలుకలను బహిర్గతం చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి నష్టం తప్పదు. ఇప్పటికైనా జిల్లా బాధ్యులు స్పందించి అందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వికారాబాద్‌: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెర లేసింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా సదానందరెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ కేడర్‌పై పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఇదిలా ఉండగా తాజాగా పరిగిలో సైతం విభేదాలు బయటపడ్డాయి. పలువురు నాయకులు ఏకంగా విలేకరుల సమావేశంలోనే జిల్లా అధ్యక్షుడి తీరును ప్రశ్నించారు. పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా సీల్డ్‌ కవర్‌ ద్వారా పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు. ఇది బీజేపీ సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనాపూర్‌ వెంకటయ్య పార్టీ బాధ్యులను నియమించాల్సి ఉండగా.. ఈ స్థానంలో తాండూరుకు చెందిన రమేశ్‌కు బాధ్య తలు అప్పగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.   

మొహం చాటేస్తున్న నేతలు... 
ఇటీవల జరిగిన పలు పార్టీ సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు జిల్లాకు చెందిన మరో ముఖ్య నేతతో పొసగకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి సైతం పరిగిలో జరిగిన కార్యకర్తల సమావేశాలు, పార్టీ పదవులకు నేతల ఎంపిక  కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదానందరెడ్డి కేడర్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం.   

కనిపించని ఏసీఆర్‌ మార్క్‌.. 
దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌పై గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నలభైకి పైగా కార్పొరేటర్‌ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ మంచి ఊపు మీద కనిపించింది. ఈ సమయంలోనే మాజీ మంత్రి, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ.చంద్రశేఖర్‌ ఆ పార్టీలో చేరడంతో శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. జిల్లాలో ఏసీఆర్‌ పార్టీకి పెద్దదిక్కుగా మారతారని అందరూ ఊహించారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతారని భావించారు. కానీ ఆయన పార్టీలో చేరింది మొదలు జిల్లా కమలం గూటిలో ఎలాంటి ఊపు కనిపించడంలేదు. కనీసం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమానికి, పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవటం విమర్శలకు తావిస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top