సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మూడేళ్ల ముందే ఇబ్రహీంపట్నంలో ఎన్నికల వేడి ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం తీవ్రస్థాయికిచేరాయి. ఇవాళ చర్చకు రావాలని మల్‌రెడ్డి రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు టెంట్లు ఏర్పాటు చేసింది. సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించడంతో పోలీసులతో బీఆర్‌ఎస్ నేతలు.. వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఫార్మా భూముల విషయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం సాగుతోంది. ‘‘అన్నీ నా హయాంలో జరిగిన పనులే.. కొత్తగా తెచ్చింది ఏముంది?" అంటూ మల్‌రెడ్డి లెక్కలను మంచిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అక్రమ కబ్జాలు తేలాలంటే ఇబ్రహీంపట్నం బస్ డిపో వెనుక ఉన్న 45 ఎకరాల దగ్గరకు రావాలని మల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఫార్మా భూముల్లో భారీ స్కామ్ జరిగిందన్న ఎమ్మెల్యే ఆరోపణలతో ఇరుపార్టీల నేతలు.. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సవాళ్లు విసురుకోవడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పొలీసులు భారీగా మోహరించారు. సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది.


