
మాజీ మంత్రి హరీశ్‌రావు
సీఎం రేవంత్ బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వైఖరికి పూర్తి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదని, బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా ఆయన వైఖరి కనిపిస్తోందని అన్నారు. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో రేవంత్ పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతి రేకంగా బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తు న్నారని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. ‘మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా మేము చెపుతున్న విషయాలనే తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెప్తున్నారు.
మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. వాటిని అడ్డుపెట్టుకుని లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని మేము చెప్తూ వస్తున్నాం. ఇన్నాళ్లుగా మే ము చేస్తున్న వాదనను ఏఐసీసీ కూడా బలపరిచింది. లిక్కర్ స్కామ్ పూర్తిగా కల్పితమని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తోందని స్వయంగా ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు.
కానీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ వైఖరికి విరుద్ధంగా మాట్లాడుతు న్నారు’ అని హరీశ్ అన్నారు. ‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న మోదీ మనిషి అని మేము ముందు నుంచీ చెప్తున్నాం. రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం మా విమర్శలను నిజమని రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నాననే విషయం కూడా మరచిపోయి బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు రేవంత్‌రెడ్డి బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకు న్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు.