2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం.. | Sakshi
Sakshi News home page

2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం..

Published Sun, Apr 16 2023 2:10 AM

First signature on filling up of 2 lakh job vacancies says Bandi Sanjay - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డపై నిరుద్యోగ మార్చ్‌ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్‌ టెన్త్‌ హిందీ పేపర్‌ లీకేజీ కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. శనివారం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు వేలాది మందితో బండి సంజయ్‌ నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించారు.

ఈ మార్చ్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీలు చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్‌ రాథోడ్‌ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన నిరుద్యోగ మార్చ్‌ ముగింపు సభలో బండి సంజయ్‌ ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించట్లేదేం? 
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో ప్రభుత్వం తప్పు చేయనప్పుడు సిట్టింగ్‌ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ‘తప్పు చేశాడు కాబట్టే నీ కొడుకును కాపాడుకోవాలనుకుంటున్నావు. వెంటనే నీ కొడుకును బర్తరఫ్‌ చెయ్‌. మెడపట్టి గెంటేయ్‌. తప్పు చేస్తే కేసీఆర్‌ కుటుంబానికి ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? ‘ఈ వేదికపై సీఎంకు చెబుతున్నా.. సిట్‌ విచారణకు మేం ఒప్పుకోం. నయీం, మియాపూర్‌ ల్యాండ్‌ స్కాం, డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ నివేదికలు ఏమయ్యాయి? కేసీఆర్‌ కుటుంబాన్ని, బీఆర్‌ఎస్‌ నాయకులను కాపాడుకొనేందుకే సిట్‌ విచారణ చేస్తున్నారు. మీరు వేసుకొనే సిట్‌లను ఇంకా నమ్మాలా’ అని బండి ప్రశ్నించారు. 

నిరుద్యోగ మార్చ్‌లు ఆగవు... 
పేపర్‌ లీకేజీపై తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పున పరిహారమివ్వాలని, అందుకోసమే నిరుద్యోగ మార్చ్‌ చేపట్టామని, ఈ మార్చ్‌ ఇంతటితో ఆగదని, ఈ నెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. వరుసగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించి తీరుతామని, ఆ తరువాత హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.  

అంబేడ్కర్‌ స్ఫూర్తిగల పార్టీ బీజేపీనే... 
‘సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో తెగదెంపులయ్యాయి. అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్‌. ఆయనకు అంబేడ్కర్‌ విగ్రహాన్ని తాకే అర్హత లేదు. దళితులను అడుగడుగునా అవమానించిన పార్టీ బీఆర్‌ఎస్‌. అంబేడ్కర్‌ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ. దళిత, గిరిజన, బలహీనవర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్న పార్టీ బీజేపీ. రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రులుగా దళిత, గిరిజన, బలహీన వర్గాల వారిని చేసిన ఘనత బీజేపీదే’ అని బండి వివరించారు.

ఒక్క అవకాశం ఇవ్వండి... 
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్‌ చేస్తున్నా... నిరుద్యోగులారా నిరాశ పడకండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్‌ ఫస్ట్‌... ఫ్యామి లీ లాస్ట్‌. తెలంగాణలో యువత మాకు ఫస్ట్‌.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. తెలంగాణ ప్రజలు, యువతను కోరుతున్నా.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తాం. రామరాజ్యం ఏర్పాటు చేస్తాం’ అని బండి సంజయ్‌ తెలిపారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్‌ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, విజయరామారావు, కన్నబోయిన రాజయ్య, దరువు ఎల్లన్న, ఆకుల విజయ పలువురు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement