విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు రచ్చ.. అయ్యన్నపాత్రుడి ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు రచ్చ.. అయ్యన్నపాత్రుడి ఆగ్రహం!

Published Sun, Apr 9 2023 6:58 PM

Fight In TDP Leaders Ayyanna patrudu Serious On Ganta Srinivasa Rao At Visakhapatnam - Sakshi

విశాఖ తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు రచ్చ రచ్చ చేస్తున్నారు. గంటాకు ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని అయ్యన్నపాత్రుడు తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పాలని డిసైడ్ అయ్యారట అయ్యన్న. గంటా విషయంలో బాబుతో తాడో పేడో తేల్చుకుంటానంటున్న అయ్యన్న ఏం చేయబోతున్నారు?  వివరాల్లోకి వెళితే..

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా వారిమధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గంటా కొద్ది రోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలను అయ్యన్నపాత్రుడే నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికీ గంటా హాజరు కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు కూడా పార్టీలో గంటాకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే అయ్యన్న వర్గీయులకు మింగుడుపడటం లేదు. నాలుగేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉండి.. ఇప్పుడు హడావుడి చేస్తున్న గంటాకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిసిన వేపాడ చిరంజీవి విజయాన్ని కూడా గంటా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అయినట్లు గంటా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ అయ్యన్న వర్గీయులకు రుచించడం లేదు. నాలుగేళ్లగా తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని.. గంటా మాత్రం తన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణకు ఇబ్బందులు వస్తాయని ఇంట్లోనుంచి బయటకే రాలేదని అయ్యన్న టీమ్ సెటైర్లు వేస్తోంది.
చదవండి: తిరుపతిలో సుగుణమ్మకు పరపతి కరువైందా? టికెట్‌ వేటలో ఆమెకు పోటీగా నలుగురు!

పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాకు లీకులు ఇచ్చుచుకుంటూ నాలుగేళ్ల పాటు కాలాక్షేపం చేసిన గంటాకు పార్టీ అధినేత ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తప్పు పడుతున్నారు. ఆయన లాంటి నాయకులు పార్టీకి అవసరం లేదని, కులం పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన చరిత్ర గంటాదని, తామెప్పుడు పదవుల ఆశించి రాజకీయాలు చేయలేదని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. చంద్రబాబు విశాఖ టూర్ సందర్భంగా అయ్యన్న వర్గీయులు అందరూ చంద్రబాబుతో అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారు.

అయ్యన్నపాత్రుడు అయితే చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందు విశాఖలో జరిగిన టీడీపీ బీసీ సదస్సుకు కూడా డుమ్మా కొట్టారు. నర్సీపట్నంలో అందుబాటులో ఉండి కూడా సదస్సుకు హాజరు కాలేదు. చంద్రబాబు విశాఖ పర్యటన ఏర్పాట్లను కూడా అయ్యన్న పర్యవేక్షించలేదు. ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశంలో కూడా అయ్యన్న చంద్రబాబుతో దూరం పాటిస్తూ వచ్చారు. చంద్రబాబు సమావేశంలో పదే పదే కల్పించుకొని అయ్యన్న పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే..అయ్యన్న అలకను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని గంటా వర్గీయులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకు నర్సీపట్నం ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఈ రెండు సీట్లపై ఇప్పటివరకు చంద్రబాబు నుంచి అయ్యన్నకు స్పష్టమైన హామీ లభించలేదు. తన కుమారునికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాకపోయినా మాడుగుల అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న కోరుతున్నారు.
చదవండి: టీడీపీ సీనియర్‌ నేతకు షాక్‌.. బాబు వద్దకు పంచాయితీ!

ఈ రెండు సీట్లును సాధించుకోవడం కోసమే అయ్యన్నపాత్రుడు వ్యూహాత్మకంగా చంద్రబాబు పర్యటన సందర్భంగా అలక అస్త్రాన్ని తెరపైకి తెచ్చారని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం అయ్యన్నకు ఇదేమి తొలిసారి కాదని, తన కోర్కెలు నెరవేర్చుకునేందుకు వివిధ రూపాల్లో అసంతృప్తిని వ్యక్తపరుస్తారని కామెంట్ చేస్తున్నారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి అయ్యన్న, గంటా మధ్య విభేదాలు రచ్చకెక్కడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని.. గ్రూపు రాజకీయాలు ఎటువైపుకు తీసుకువెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement