అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి | From ₹2,500 Salary To Minister, Ex House Help Kalita Majhi Takes Oath As Bengal Minister, Inspiring Success Story Inside | Sakshi
Sakshi News home page

అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి

Jun 1 2026 9:25 PM | Updated on Jun 2 2026 2:50 PM

Ex House Help Kalita Majhi Takes Oath As Bengal Minister Of State

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.

ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.

బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.

సోమవారం కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క‍్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.

కాగా, బెంగాల్‌ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement