డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరాటం ఉధృతం | DSC irregularities: Ysrcp Representations To Collector All Districts | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరాటం ఉధృతం

Jul 29 2026 4:36 PM | Updated on Jul 29 2026 7:09 PM

DSC irregularities: Ysrcp Representations To Collector All Districts

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరాటం ఉధృతం చేసింది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని‌ డిమాండ్ చేస్తూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 3, 4 తేదీలలో అన్ని నియోజకవర్గాలోనూ టౌన్ హాలు సమావేశాలు నిర్వహించడంతో పాటు 6 నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని తెలిపారు.

కాగా, మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిన్న (మంగళవారం) పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement