నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది? | Defections Raise Doubts on Public Trust | Sakshi
Sakshi News home page

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

Jun 23 2026 5:47 AM | Updated on Jun 23 2026 5:58 AM

Defections Raise Doubts on Public Trust

దేశ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు అనర్హత నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అధికార బలం పెంచుకోవడానికి జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహాలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తరచూ జరిగే పార్టీ మార్పులు రాజకీయ పార్టీలపైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెరుగుతున్న ఫిరాయింపులు, వాటి వెనుక ఉన్న కారణాలు, చట్టపరమైన అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.

దేశ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేనలో అధికారికంగా చేరారు. 2022లో శివసేనను చీల్చి, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. ఇప్పుడు మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించారు. "ఆపరేషన్ టైగర్" పేరుతో సాగిన ఈ ప్రక్రియలో ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు చెల్లిస్తున్నారని, అందులో రూ.15 కోట్లు ముందుగానే ఇచ్చారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆరోపణలు చేస్తోంది.

పార్టీ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది మారుతుండడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత తప్పించుకుంటారని విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే, ఎంపీల బృందం మరో పార్టీలో చేరాలంటే, ముందు వారి అసలు పార్టీ కూడా అదే తరహా విలీనాన్ని అధికారికంగా ఆమోదించాలనే నిబంధన ఉందన్న వాదన కూడా ఉంది.

వరసగా ఫిరాయింపులు
ఈ ఫిరాయింపులకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ మార్పులు జరిగాయి. ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు భారతీయ జనతా పార్టీలో చేరారు. మేలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, లోక్‌సభలో ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది త్రిపుర కేంద్రంగా ఉన్న, పెద్దగా గుర్తింపు లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు.

వ్యంగ్యంగా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుల్లో కొందరికి ఈ ప్రముఖ ఫిరాయింపు విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫిరాయింపుల నుంచి సురక్షితంగా కనిపించడం లేదు. సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)లో కూడా ఇలాంటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీలకు లోక్‌సభలో వరుసగా 37 మంది, 8 మంది ఎంపీలు ఉన్నారు.

ఈ రాజకీయ పరిణామాల వెనుక అతిపెద్ద లబ్ధిదారుగా బీజేపీ నిలుస్తోంది. పార్లమెంట్‌లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ రాజకీయ అవకాశవాదం, ఫిరాయింపులను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇప్పుడు అది ‘‘ప్రభావం కోల్పోయిన నిబంధన’’గా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement