సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

Congress MLA Jagga Reddy Meeting With Telangana CM KCR - Sakshi

అసెంబ్లీలో కలసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే

నేను దొంగచాటుగా కలవలేదు.. నియోజకవర్గ సమస్యల కోసమే కలిశా: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ హాల్‌లో సీఎంను కలసి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత లాబీల్లోని సీఎం చాంబర్‌లోనూ కలిశారు. కాగా, ఈ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. సీఎంను కలసిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లా డుతూ తాను దొంగచాటుగా ముఖ్యమంత్రిని కలవలేదని పేర్కొన్నారు.

తాను సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ హాల్‌లోనే కలిశానని, ఆ తర్వాత ఆయన చాంబర్‌లో టైం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్‌ ఎంపీలు కలుస్తారని, అలాగే ఎమ్మెల్యేగా తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. మియాపూర్‌ నుంచి సంగారెడ్డి, సదాశివపేట వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చానని, దళితబంధు పథకం కోసం తన నియోజకవర్గంలోని 550 మంది అర్హుల జాబితా ఇచ్చానని, మహబూబ్‌ సాగర్‌ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని అడిగానని చెప్పారు.

అలాగే సిద్ధాపూర్‌లో 5వేల మందికి, కొండాపూర్‌ ఆలియాబాద్‌లో 4వేల మందికి ఇళ్లను అప్పగించాలని కూడా సీఎంను కోరినట్టు చెప్పారు. ఇవే వినతిపత్రాలను మంత్రి కేటీఆర్‌కు కూడా ఇచ్చానని తెలిపారు. తన వినతులపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పిన జగ్గారెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు మరోమారు టైం ఇవ్వాలని సీఎంను కోరానని, ప్రగతిభవన్‌లో సమయం ఇస్తే వచ్చి కలుస్తానని చెప్పానని వెల్లడించారు.   

చదవండి: టీఎస్‌ అసెంబ్లీ: కేటీఆర్‌ Vs శ్రీధర్‌ బాబు హీటెక్కిన సభ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top