
నర్సాపూర్ /పరకాల/బంజారాహిల్స్ (హైదరాబాద్): ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం కాదని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే రాజ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆకలి కేకల రాజ్యమవుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చామని, అది తండాలకు, గ్రామీణ ప్రాంత పేదలకు నిలువ నీడ కోసం ఇళ్లు మంజూరు చేసిన రాజ్యమని, రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యమని, దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసిందని, పోడు భూములకు పట్టాలిచ్చిందని, సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిందని వివరించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో దొరల పాలనకు పాతర వేసి ఇందిరమ్మ రాజ్యం సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్, హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన సభల్లో, హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.
వాగ్దానం మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియా
‘సిద్దిపేటలో కేసీఆర్‌కు సింగిల్ విండో డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం కాదా? యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన సంజయ్‌గాంధీ ఇందిరమ్మ కుమారుడన్న విషయం మరిచిపోయావా? సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి స్టేషన్‌లో, బిర్లామందిర్ మెట్లపై అడుక్కుతినే వారు. 2004లో హుజూరాబాద్ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని 2014 సంవత్సరంలో నిజం చేస్తూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాం«దీది. మొదట్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది..’అని రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాచరిక రాజ్యం
‘రాష్ట్రంలో అరాచకం, రాచరిక రాజ్యం నడుస్తోంది. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. రాష్ట్రంలో 1,800 బార్లు, 3 వేల వైన్ షాపులు, 62 వేల బెల్టు షాపులు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా తయారు చేశాడు. మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్‌లో కలిపి నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. జిల్లాను చార్మినార్ జోన్‌లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటుంది. కాంగ్రెస్‌కు అన్యాయం చేసి కేసీఆర్ పంచన చేరిన వారిని బండకేసి కొట్టాలి. కేసీఆర్‌కు కాలం చెల్లింది..’అని అన్నారు.
పేదలు కరెంటు బిల్లు కట్టకండి
‘కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఏమి చేశారో ప్రజలకు చెప్పలేక కాంగ్రెస్ పార్టీని తిట్టే పని పెట్టుకున్నాడు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని మోసం చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తాం. మహాలక్ష్మీ పథకం ద్వారా కుటుంబంలో మహిళకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ప్రతి మహిళకు ఉచితంగా ప్రయాణం, ఇంట్లో ఆడపిల్ల వివాహానికి రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూం తదితర హామీలు అమలు చేస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చే నెల నుంచి అర్హులైన పేదలు కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 20 సంవత్సరాల తర్వాత పీజేఆర్ కుటుంబానికి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం సోనియాగాంధీ కల్పించారని, ఆమె నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నియోజకవర్గం ఆడపడుచులపై ఉందని చెప్పారు. దానం నాగేందర్ చరిత్ర అందరికీ తెలుసని, పంజాగుట్ట దివాన్‡్ష బార్ ముందు బీడీలు అమ్ముకునేవాడని ధ్వజమెత్తారు.
పీజేఆర్‌కు డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి నేడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడి పేరుతో దేవుడికే పంగనామాలు పెట్టారని ఆరోపించారు. సభలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పార్టీ పరకాల, నర్సాపూర్, ఖైరతాబాద్ అభ్యర్థులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, విజయారెడ్డి, పార్టీ నేతలు అద్దంకి దయాకర్, శోభారాణి, సిరిసిల్ల రాజయ్య, కొండా మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.