
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
అదానీతో సెబీ చైర్‌పర్సన్ కుమ్మక్కై రూ.లక్షల కోట్లు దోచుకున్నట్లు హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది
దీనిపై జేపీసీ వేయమంటే ప్రధాని పార్లమెంటు వాయిదా వేసి పారిపోయారన్న సీఎం
ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా
సెబీ చైర్‌పర్సన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: లక్షల కోట్ల అప్పులతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రధాని మోదీ పేదలకు దక్కాల్సిన జాతి సంపదను తన వాళ్లకు దోచిపెడుతున్నారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అదానీతో సెబీ చైర్‌పర్సన్ కుమ్మక్కై రూ.లక్షల కోట్లు దోచుకున్నట్లు హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిందని చెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయమంటే పార్లమెంటును నాలుగు రోజుల ముందే వాయిదా వేసి ప్రధాని పారిపోయారని మండిపడ్డారు.
‘హమ్ దో.. హమారే దో’ అన్నట్టుగా మోదీ, అమిత్ షా–అదానీ, అంబానీ వ్యవహారం తయారయ్యిందని తీవ్రంగా విమర్శించారు. సెబీ చైర్‌పర్సన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, అదానీ కుంభ కోణంపై విచారణ జరపాలనే డిమాండ్‌తో, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. అంతకుముందు గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం నుంచి మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా ఈడీ కార్యాలయం వరకు వచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. ప్రధానితో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
ఇద్దరి చేతుల్లోకి జాతి సంపద
‘అదానీని కాపాడేందుకే ప్రధాని సెబీ కుంభకోణంపై జేపీసీ వేయడం లేదు. దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయి. అయితే దేశాన్ని 67 ఏళ్లు పాలించిన 16 మంది ప్రధానులు చేసిన అప్పులతో పోల్చుకుంటే మోదీ ప్రధాని అయిన తరువాత చేసినవి రెండింతలు ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు వంటి ప్రధానులు దేశాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేశారు. కానీ మోదీ తెచ్చిన గొప్ప ప్రాజెక్టులు ఏమీలేవు. పైగా పేదలకు చెందాల్సిన జాతి సంపద ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. సెబీ చైర్‌పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి.
కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు?: సెబీ కుంభకోణంపై బీజేపీని కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. కానీ బీజేపీకి బీఆర్‌ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. మోదీని సంతృప్తిపరిచేందుకు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటాం..’ అని రేవంత్ అన్నారు.
ఈ సన్నాసులను నమ్ముకొని రైతులు రోడ్డెక్కొద్దు
‘రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. రుణమాఫీ కానివాళ్లు కలెక్టరేట్‌లకు వెళ్లి పిటిషన్లు ఇవ్వాలి. ధర్నాలు అవసరం లేదు. పదేళ్లు మిమ్మల్ని దోచుకుతిన్న ఈ బీఆర్‌ఎస్ దోపిడీ దొంగలను నమ్మొద్దు. మొన్ననే తరిమికొట్టిన దొంగలను మళ్లీ ఊళ్లకు ఎందుకు రానిస్తున్నారు? రాజీనామా చేయాల్సి వస్తుందని హరీశ్ డ్రామాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 39లో 9 కూడా మిగలవు..’ అని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఆస్తులు నిలబెడితే.. మోదీ దోచిపెడుతున్నారు: భట్టి
కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని ఆస్తులు, సంపద, వనరులను నిలబెడితే వాటిని ప్రధాని మోదీ.. అదానీ వంటి క్రోని కాపిట లిస్టులకు (స్నేహితులైన పెట్టుబడిదారులకు) దోచిపెడుతు న్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తీరును రాహుల్‌గాంధీ చెప్పినప్పుడు మొదట స్పందించకపోయినా ఇప్పుడు ఒక్కొక్క అవినీతి వెలుగులోకి వస్తుంటే ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. దేశ సంపదను కాపాడాల్సిన సెబీ చైర్మన్ ఈ దోపిడీలో భాగస్వామిగా ఉన్నా రని హిండెన్‌బర్గ్ సంస్థ పరిశోధించి బయట పెట్టడంతో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని భట్టి వ్యాఖ్యానించారు.
ధర్నా అనంతరం రేవంత్, భట్టి, ఏఐసీసీ నేతలు దీపాదాస్ మున్షీ, సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఈడీ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, పార్టీ నేతలు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.