కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments in Kerala Election Campaign | Sakshi
Sakshi News home page

కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్‌

Apr 8 2026 1:22 AM | Updated on Apr 8 2026 1:22 AM

CM Revanth Reddy Comments in Kerala Election Campaign

కేరళలో రోడ్‌షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి తదితరులు

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి 

పినరయి విజయన్‌ ఈ వాస్తవాన్ని గ్రహించాలి 

కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

విజయన్‌ హయాం ముగిసిందని,యూడీఎఫ్‌ పాలన రాబోతోందని వ్యాఖ్య 

విజయన్‌ రాసిన లేఖకు తిరుగు లేఖ రాసిన రేవంత్‌రెడ్డి 

ఆర్థిక సూచీల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలోఉందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణల మధ్య కాదని, కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ల మధ్య జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ గ్రహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయన్‌ ఎప్పుడైనా వచ్చి పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ‘పినరయి విజయన్‌తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను కూడా నేను తెలంగాణకు ఆహా్వనిస్తున్నా. రాష్ట్రంలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. అతిథులుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడైనా వచ్చి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..’అంటూ సవాల్‌ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం..కోవలం, మాలవిక్కర, పతానపురం నియోజకవర్గాల్లో యూడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రేవంత్‌ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ రోడ్‌షోల్లో అలాగే అక్కడి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు.  

విజయన్‌ హయాం ముగిసింది..: ‘కేరళలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్‌ సీఎంలు కరుణాకరన్, ఉమెన్‌ చాందీలదే. పినరయి విజయన్‌ హయాం ముగిసింది. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది. మూడింట రెండొంతుల మెజార్టీతో కేరళలో యూడీఎఫ్‌ పాలన రాబోతోంది. విజయన్‌ గాడ్‌ఫాదర్‌ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. ఆయనే విజయన్‌ను కేసుల నుంచి ర క్షిస్తున్నారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్‌తో సహా అనేక మంది నేతలను వేధిస్తున్న కేంద్రం.. విజయన్‌ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మోదీ, విజయన్‌ల మధ్య అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు. వారిద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లి సరైన నిర్ణయం చెపుతారు..’అని సీఎం రేవంత్‌ అన్నారు.  

కొనసాగుతున్న లేఖల యుద్ధం 
కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ కేరళ వెళ్లి చేసిన వ్యాఖ్యలకు ‘ఎక్స్‌’వేదికగా విజయన్‌ కౌంటర్‌ ఇవ్వగా, విజయన్‌కు లేఖ రాస్తూ రేవంత్‌ అంతే ధీటుగా స్పందించారు. దీనికి మరోమారు విజయన్‌ లేఖ రూపంలో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వగా రేవంత్‌ మరోసారి ప్రతి లేఖ రాశారు. ‘కేరళ ప్రభుత్వ పనితీరుపై నేను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నా. కానీ మీ ప్రతిస్పందనలో అభ్యంతరకరమైన భాషను వాడారు. నేనెప్పుడూ ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై ఆవేశపూరితంగా స్పందించను. 

అయితే మీరు నీతి ఆయోగ్‌ ఇచ్చిన 2023–24 నివేదికను ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో మేం అధికారంలో లేము. అది బీఆర్‌ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలనలో చివరి దశ. మేం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏం జరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అంచనా వేయండి. తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ తదితర ఆర్థిక సూచీల్లో ఆర్‌బీఐ హ్యాండ్‌బుక్‌ 2024–25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. దేశంలోనే ముందు స్థానంలో నిలిచింది.  

బంగారం స్మగ్లింగ్‌ కేసు ఏమైంది? 
నీతి ఆయోగ్‌ ఇచ్చిన అవినీతి ర్యాంకులను కూడా నేను గౌరవిస్తాను. కానీ మీ ప్రభుత్వం స్వచ్ఛమైనది అయితే బంగారం స్మగ్లింగ్‌ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింది. మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయటపడినా చర్యలేవి? శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదు? మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌–2047 దార్శనికతతో ముందెకెళుతోంది. అలాగే కేరళలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ’నవ కేరళ’దార్శనికతను అమలు చేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కేరళ ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. జరగాల్సింది కూడా అదే..’అని రేవంత్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా కేరళ ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం హైదరాబాద్‌ చేరుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement