చంటి బిడ్డల్లా సాదుకున్నా..! | Sakshi
Sakshi News home page

చంటి బిడ్డల్లా సాదుకున్నా..!

Published Mon, Oct 16 2023 3:37 AM

CM KCR Directions to MLA Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎమ్మెల్యేలను చంటి బిడ్డల్లా సాదుకున్నా. చిన్న చిన్న పొరపాట్లతో ఓటమి కొని తెచ్చుకోవద్దు. 60రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించినా చాలా మంది నియోజకవర్గాల్లో పార్టీలోని అంతర్గత అసమ్మతిని చక్కదిద్దుకోలేక పోయారు. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించగానే ఎమ్మెల్యేలు అయినట్టుగా భావించకూడదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే ప్రజలు బండకేసి కొడతారని చరిత్ర చెప్తోంది..’’అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థులను హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఎంత చిన్నస్థాయి కార్యకర్త అయినా కలుపుకొని వెళ్లాలని.. గతంలో జూపల్లి కృష్ణారావు వంటి ఒకరిద్దరు నేతలు అలాంటి కారణాలతోనే ఓటమి పాలయ్యారని కేసీఆర్‌ వివరించారు. నాయకులను నిశితంగా పరిశీలించాకే ఓటర్లు నిర్ణయం తీసుకుంటారని.. ఏ ఒక్కరినీ తక్కువగా అంచనా వేయకుండా అందరితో కలసి పనిచేయాలని సూచించారు.

వరుసగా పదేళ్లపాటు మనం అధికారంలో ఉన్నందున ప్రజల్లో కొంత అసహనం ఉండటం సహజమేని.. ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సహనంతో సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వేల ఫలితాలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని.. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. 

అభ్యర్థులందరి అఫిడవిట్ల పరిశీలన! 
నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు సహా ఎన్నికల సంఘం నిబంధనలను పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ‘‘ఇంతకుముందు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వంటి నేతలు భారీ మెజారిటీతో గెలుపొందినా అఫిడవిట్లలోని కొన్ని సాంకేతిక అంశాలతో ఇబ్బందులు పడ్డారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా సమర్పించే అఫిడవిట్లలో తప్పులు లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, నేరారోపణలకు సంబంధించిన అంశాలు ఉంటే కచ్ఛితంగా పేర్కొనండి. ట్రాఫిక్‌ చలాన్లు, ఫోన్‌ బిల్లులు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు, ఆదాయ పన్ను రిటర్నులు వంటివీ జాగ్రత్తగా చూసుకోండి.

ఈసారి పార్టీ అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లను బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ స్రూ్కటినీ చేస్తుంది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం లోపు అఫిడవిట్లను తెలంగాణభవన్‌లో డైరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భరత్‌కుమార్‌ గుప్తా బృందానికి అందజేయాలి..’’అని కేసీఆర్‌ ఆదేశించారు. పార్టీ నిధి నుంచి ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు ఇస్తున్న డబ్బులతో ప్రత్యేక ఖాతాను తెరవాలని సూచించారు.

నామినేషన్‌ దాఖలు కోసం చివరి తేదీ వరకు వేచి చూడొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయం వివరాలను ఏ రోజుకారోజే అధికారులకు అప్పగించి రశీదులు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఏజెంట్ల నియామకం మొదలుకుని ఓట్ల లెక్కింపు దాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను తొలిసారి పోటీ చేసినప్పుడు ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా లేనందునే ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున అన్ని బూత్‌లను పార్టీ అభ్యర్థులు పరిశీలించాలన్నారు.

69 మందికి బీఫారాలు.. రూ.40 లక్షల చెక్కులు 
అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. తన సెంటిమెంట్‌ అయిన ఆరు సంఖ్య వచ్చేలా 15 న 51 మంది అభ్యర్థులకు తొలి విడతగా పంపిణీ చేశారు. ఇందులోనూ ఆరుగురు అభ్యర్థులకు సంబంధించి ప్రగతిభవన్‌లో, మిగ తా వారికి తెలంగాణ భవన్‌లో అందజేశారు. నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో జీవన్‌రెడ్డి (ఆర్మూర్‌), కేటీఆర్‌ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగాం), బాల్క సుమన్‌ (చెన్నూరు), కేసీఆర్‌ (గజ్వేల్‌) బీఫారాలు అందుకున్నారు.

తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ తరఫున కామారెడ్డి బీఫారంను సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీసుకున్నారు. తన తల్లి మృతిచెందిన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ) రాలేకపోవడంతో ఆయన తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఫాం అందుకున్నారు. పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు ప్రచార ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.40లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేశారు.

అయితే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టిన ఐదు సీట్లకుగాను పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) ఒక్కరే ఆదివారం బీఫారం అందుకున్నారు. నర్సాపూర్, మల్కాజిగిరి, గోషామహల్, నాంపల్లి సీట్లలో ఎవరు పోటీచేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆదివారం సాయంత్రమే రెండో విడత బీఫారాల పంపిణీ మొదలైంది. కేసీఆర్‌ చేతుల మీదుగా మరో 18 మంది అభ్యర్థులు బీఫారాలు తీసుకున్నారు.  బీఫారాలు తీసుకున్నవారి సంఖ్య 69కి చేరింది.

Advertisement
Advertisement