జగిత్యాల: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఇంతకాలం కాంగ్రెస్‌లో కొనసాగారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందే జీవన్‌రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 9వ తేదీ) జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించేందుకు తమ సహోదరులందరితో కలిసి ఆయన వద్దకు వచ్చామన్నారు. దీనిలో జీవన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
‘2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ, నిబద్ధత గల నాయకుడిగా ఆయన కాంగ్రెస్‌తోనే కొనసాగారు. కేసీఆర్, జీవన్‌రెడ్డిల బంధం ఈనాటిది కాదు. జూన్ 2, 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి సారి జగిత్యాలకు వచ్చారు. ఆరోజు బోర్నపల్లి బ్రిడ్జి గురించి జీవన్ రెడ్డి.. కేసీఆర్ అడిగారు. ఆయనడిగిందే తడవుగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సాంక్షన్ ఇచ్చారు
షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డి ఫైట్ చేశారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మహారాష్ట్ర తరహా కో ఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో పెడదామన్నారు. పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి చేరిక బాగుంటుందని జగిత్యాల నాయకత్వం కూడా మద్దతు తెలిపింది’ అని తెలిపారు
కాలం నెట్టుకొచ్చే ప్రభుత్వం ఇది
కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది కాలం నెట్టుకొచ్చే సర్కారు అంటూ ధ్వజమెత్తారు. ‘ మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. రూ. 70 లక్షల కోట్లు రైతులకు బకాయి పడ్డారు. బాసరలో ముఖ్యమంత్రి భాష అసహ్యంగా ఉంది. నిఖార్సైన జీవన్‌రెడ్డి వంటి నేతలను అవమానపరుస్తోంది ఈ కాంగ్రెస్
నేను భట్టి ఇంటికి పెళ్లికి పోయినప్పుడు కూడా వంద మంది రాబోయేది మీ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్‌ను కూడా కలిసి తన నిర్ణయం ప్రకటిస్తామన్నారు జీవన్‌రెడ్డి. జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
వారికి ధన్యవాదాలు: జీవన్‌రెడ్డి
కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ మా ఇంటికి పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. కాంగ్రెస్ నుంచి రాజీనామా భావోద్వేగానికి గురి చేసింది. ఇవాళ బీఆర్‌ఎస్‌తో కలవడం సంతోషంగా ఉంది. గత 20 మాసాలుగా అవమానాలు తట్టుకుని ఓపిక పట్టా. ఎందరి ప్రభుత్వాలో చూశాను.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో ఉంది. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం. కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం సంతోషంగా ఉంది


