కాంగ్రెస్‌ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు | BRS Leader KTR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు

May 18 2026 6:06 AM | Updated on May 18 2026 6:06 AM

BRS Leader KTR Fires On Congress Govt

వనస్థలిపురం (హైదరాబాద్‌): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్‌ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్‌ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 

ఆదివారం హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో  మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్‌ఎస్‌ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్‌ బాలిక విషయమై బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్‌ చేస్తున్నాం. బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్‌ చెప్పారు.  

‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి 
    ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ (సర్‌) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై బీఆర్‌ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్‌బీనగర్‌లో ఉన్న 18 డివిజన్లను బీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్‌పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement