రేవంత్‌ రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం.. | BRS Leader KTR Fires On CM Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం..

May 31 2026 5:40 AM | Updated on May 31 2026 5:40 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy Govt

శనివారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్‌

ఆయన పేమెంట్‌ కోటాలో సీఎం గద్దెనెక్కారు..  

కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధం 

చిన్న కాంట్రాక్టర్లను ముంచుతున్న జీవో 17ను 

రద్దు చేయాలి... బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం  

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ మహాధర్నాలో కేటీఆర్‌

కవాడిగూడ/ముషీరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పేమెంట్‌ కోటాలో సీఎం గద్దెనెక్కారని, ఆయన రెగ్యులర్‌ సీఎం కాదని, రెన్యువల్‌ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్‌లు, ఆరు గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి జీవో 17తో చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు, బీజేపీ నేతలకు దక్కుతున్నాయని ఆరోపించారు. 2028లో బీఆర్‌ఎస్‌ వస్తుందని, 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్‌ మందా శ్యామ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.  

ఒక్క ఇళ్లయినా కట్టావా? 
జీహెచ్‌ఎంసీలో ఒక్క ఇళ్లయినా కట్టావా అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కానీ ఎంత మంది ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ ఘాటుగా మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అధ్యక్షతన జరిగిన బూత్‌ లెవల్‌ ఏజెంట్స్‌ (బీఎల్‌ఏ) సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే కండలు తిరిగిన పహిల్వాన్‌ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా... అన్న సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి?’అని సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్‌ ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్‌ ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement