కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి
రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
రాష్ట్రంలో మైనార్టీ ప్రాతినిధ్యంలేని ప్రభుత్వం ఉందని ఎద్దేవా
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్‌డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు.
తుపాకీ రోహిన్‌రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఓఆర్‌ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు.
మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్‌లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు.


