
రైతుతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి
నల్లగొండలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
ఏక్‌నాథ్ షిండేలు మీ పార్టీలోనే ఉన్నారట
మేమేమీ మీ ప్రభుత్వాన్ని పడగొట్టం
ఐదేళ్లు సీఎంగా ఉండు..హామీలు అమలు చెయ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మీకు డేంజర్ నల్లగొండ, ఖమ్మం బాంబులతోనే.. బీఆర్‌ఎస్‌తో మీకేం డేంజర్ లేదు. మేమేమీ మీ ప్రభుత్వాన్ని పడగొట్టం. ఏక్‌నాథ్ షిండేలు మీ పార్టీలోనే ఉన్నారని బీజేపీ వాళ్లే చెబుతున్నారు..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
‘మీ వాళ్లే మీ ప్రభుత్వాన్ని పడగొడతారు. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుసగుసలు పెడుతున్నరట. నేనొస్తా.. నేనొస్తా.. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అంటున్నడట. నీ పక్కనే ఉన్నారు డేంజర్ గాళ్లు. మేము కాదు.. ఐదేళ్లు సీఎంగా ఉండు. 450 హామీలు అమలు చెయ్.. లేదంటే వదిలి పెట్టేది లేదు’అని కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల తర్వాత రేవంతే బీజేపీలోకి వెళ్తారు
లోక్‌సభ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయట పడటం కోసం రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళతారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయం పదిసార్లు అన్నా రేవంత్‌రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భయమా? భక్తా.. మోదీ దగ్గరకు వెళ్లేందుకు మార్గం వేసుకుంటున్నా రనే సీక్రెట్ బయట పడిందనే ఇబ్బందా చెప్పాలన్నారు.
రాహుల్‌గాంధీ ఢిల్లీలో మోదీని దొంగ అని విమర్శిస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం మోదీ మా పెద్దన్న అని అంటున్నారని గుర్తు చేశారు. గుజరాత్‌లో అంతా స్కామ్‌లు జరుగుతున్నాయని రాహుల్ విమర్శిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తానంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు.
చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకే ఓటమి
పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశా మని కేటీఆర్ అన్నారు. అయి తే చేసిన అభివృద్ధి చెప్పుకోక పోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినట్లుగా ఓయూ విద్యార్థుల సర్వేలో తేలిందని తెలిపారు. పదేళ్లలో 1,63,283 ఉద్యోగాలు ఇచ్చా మని, ఈ విషయాన్ని యువ తకు, నిరు ద్యోగులకు, ప్రజలకు చెప్పి వారి మనసు గెలుచుకోలేకపోయామని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, పెళ్లి చేసుకుని సంసారం చేస్తేనే పిల్లలు పుడతారు కదా.. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకే వాళ్లు ఉత్తర్వులు ఇచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 73 శాతం మేర జీతాలు పెంచినా, నెలలో మొదటి రోజు జీతాలు పడటం లేదని వారు దూరమయ్యారని అన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులతో ఇవ్వలేకపోతున్నామని ఉద్యోగులకు సర్ది చెప్పడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అసమర్థత వల్లే కరువు
6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నల్లగొండ రూరల్: ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఏర్పడిన కరువు’అని కేటీఆర్ చెప్పారు. పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతుంటే సీఎం, మంత్రులు రైతులకు ధైర్యం చెప్పడం లేదని, పొలాలను పరిశీలించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామానికి చెందిన రైతులు గన్నెబోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి నివాసాలకు ఆయన వెళ్లారు. మల్లయ్య యాదవ్‌కు బీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఇచ్చిన రూ.లక్ష చెక్కును అందజేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో రెండు పంటలకు సాగునీరు అందేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని, ఎండిన వరికి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని, క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఈ నెల 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.