సబితా ఇంద్రారెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు
పెద్దషాపూర్‌లో జరుగుతున్న ఈ భూ ఆక్రమణపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపించాలి
బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో సర్వే నంబరు 173 నుంచి 183 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరిగిందన్నారు. సుమారు రూ.వేయి కోట్లు విలువ చేసే ఈ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా నిషేధిత జాబితా 22ఏలో పెట్టాలని తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని 2026 జనవరిలో హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లోనూ పొందుపరచడంతో పాటు దీనిని ప్రభుత్వ భూమిగా ఫిబ్రవరి 24న తహశీల్దార్ తేల్చారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా పేర్కొంటూ భూ భారతిలోనూ అప్‌లోడ్ చేశారు. కలెక్టర్ ఆమోదం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? రూ.వేయి కోట్ల విలువైన భూములపై జరిగిన కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బదిలీతో సరిపెడుతారా?
‘భూ కుంభకోణంపై మీడియా కథనాల నేపథ్యంలో కేవలం తహశీల్దార్ బదిలీతో సరిపెట్టారు. దాడుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్ల వల్ల తిరిగి వచ్చారో చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూ భారతిలో 170ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా నమోదైంది. తహశీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగించాలి. భూ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరపడంతో పాటు ఇందులో భాగస్వాములైన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై విచారణ జరపాలి’ అని హరీశ్‌రావు డిమాండు చేశారు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడాన్ని హరీశ్ ఖండించారు. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన డ్రైవర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు బీఆర్‌ఎస్ అండగా నిలవడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు.


