లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్‌ సవాల్‌ | BRS Harish Rao Political Challenge To HYDRA | Sakshi
Sakshi News home page

లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్‌ సవాల్‌

Apr 5 2026 1:18 PM | Updated on Apr 5 2026 3:12 PM

BRS Harish Rao Political Challenge To HYDRA

సాక్షి, హైదరాబాద్‌: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నాదర్‌గూల్‌ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్‌గూల్‌ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్‌గూల్‌ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.

లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్‌కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్‌కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్‌ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement