ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి? | BRS chief KCR fires on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి?

Apr 28 2026 5:44 AM | Updated on Apr 28 2026 5:44 AM

BRS chief KCR fires on CM Revanth Reddy

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్య నేతలనుద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్‌

ఇదో చిల్లర ప్రభుత్వం... బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫైర్‌ 

కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు..

బొందలో పడినట్టైందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు 

తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా వ్యవహరించారు 

బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం సృష్టించేవారు 

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలి 

రాష్ట్ర కార్యవర్గం మినహా పార్టీ సంస్థాగత కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటన

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇది ఒక చిల్లర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి, ఆ కూతలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్ధం కావడం లేదు. బొందలో పడినట్లు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏ ర్పాటు అంటూ ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. దళారుల ప్రమేయం లేకుండా వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతుబంధు పథకాన్ని నిర్వీర్యం చేసి ఒక్కో దఫాలో ఒక్కో ఎకరాకు డబ్బులు ఇస్తూ రైతులను ప్రభుత్వం వంచిస్తోంది..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం కోసం నడుం బిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం ఉధృతం చేయాలన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400 మంది పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి నుంచి వివిధ అంశాలపై కేసీఆర్‌ సలహాలు, సూచనలు స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు నేతలను ఉద్దేశించి మాట్లాడారు.  

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి 
‘బీఆర్‌ఎస్‌కే తెలంగాణ పట్ల తడి, ఆర్తి ఉంది. తేజస్వీ సూర్య అనే వెధవ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌ విభజనతో పోలుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా నిశ్చలంగా మారారు. వారి ని్రష్కియాపరత్వం స్పష్టంగా కనిపించింది. అదే లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు కనిపించింది. బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. మహిళలకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 

జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు 
తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక రకాలుగా అవమానాలు, క్షోభను అనుభవించా. హైదరాబాద్‌ లేని తెలంగాణకు అంగీకరిస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్‌ అధినేత సోనియా చెప్పినా నేను అంగీకరించలేదు.  జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..’ అని కేసీఆర్‌ చెప్పారు.  

‘సర్‌’లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి 
‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)పై పశ్చిమ బెంగాల్, బిహార్‌ తరహాలో లక్షలాది మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో బూత్‌ స్థాయిలో పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు కావడం వల్లే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలైనట్లు గుర్తించాం. ‘సర్‌’లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.  

త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు 
బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం మినహా గ్రామ స్థాయి మొదలుకుని అన్నిరకాల కమిటీలు రద్దు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు నియోజకవర్గానికి 200 మంది చొప్పున శిక్షణ ఇచ్చి తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా తీర్చిదిద్దుతాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. పనిచేసే వారికే  భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తాం.
 
జీవన్‌రెడ్డి సేవలు వినియోగించుకుంటాం 
కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల పార్టీలో చేరిన టి.జీవన్‌రెడ్డిని కేవలం జగిత్యాలకు పరిమితం చేయకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటాం. రాజ్యసభ ఎంపీగా ఇటీవల రిటైరైన కేఆర్‌ సురేశ్‌రెడ్డి బాగా పని చేశారు..’ అంటూ కేసీఆర్‌ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం నందినగర్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. ఇటీవల పారీ్టలో చేరిన జీవన్‌రెడ్డితో కలిసి లంచ్‌ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement