కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ-జనసేన మధ్య పూర్తి సమన్వయం ఉన్నట్టే కనిపిస్తున్నా.. ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం జనసేనకు రెండో ప్రాధాన్యతే దక్కుతోందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. కీలక నిర్ణయాల్లో జనసేన అభిప్రాయానికి పెద్దగా విలువ లేదన్న అసంతృప్తి, పదవుల పంపకాల్లో తమ వారిని పక్కన పెడుతున్నారన్న గుసగుసలు, అధికార వ్యవస్థలో టీడీపీ నేతలే తుది మాట చెబుతున్నారన్న విమర్శలు.. ఇవన్నీ అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్ నియామకం ఆ చర్చకు మరో కొత్త ఉదాహరణగా మారింది.
ఎన్నికల సమయంలో భుజం భుజాన వేసుకుని తిరిగిన మిత్రపక్షాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం “ఎవరి లెక్క వాళ్లది” అనే సూత్రాన్ని మళ్లీ బయటపెడుతున్నాయి. టీడీపీ వ్యవహారశైలితో “సలహాలు మనవి.. నిర్ణయాలు వారివి” అన్న భావన జనసేన వర్గాల్లో మరింత బలపడేలా చేస్తోంది. అందుకు మరో ఊదాహరణగా మారింది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామక వ్యవహారం. మరీముఖ్యంగా పవన్ కళ్యాణ్ సూచించిన పేరును పక్కనపెట్టి, చివరికి భరత్ భూషణ్‌కు పదవి ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏఎం రత్నం.. తెలుగు గడ్డపై పుట్టి తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్లు, కొన్ని ఫట్లు అందిపుచ్చుకున్న నిర్మాత. తెలుగు చిత్రపరిశ్రమకు ఎంతో సేవ చేశారని, పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్ పదవికి సరైన వ్యక్తి అని.. కాబట్టి ఈ పదవి కోసం ఆయన పేరును తానే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడికి సిఫార్సు చేస్తున్నట్లు హరిహర వీరమల్లు చిత్ర ప్రెస్‌మీట్ టైంలో పవన్ ప్రకటించారు.
సినీ పరిశ్రమకు దగ్గరగా ఉండే వ్యక్తిగా, అనుభవం ఉన్నవాడిగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అభిప్రాయం. అలాగే తమ మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా మరో కారణం అన్నట్లు మాట్లాడారాయన. “ఖుషి” నుంచి “హరి హర వీరమల్లు” దాకా సాగింది వీళ్ల ప్రయాణం. దీంతో FDC చైర్మన్ పోస్టు ఆయనకే ఖాయమన్న భావన జనసేన శ్రేణుల్లో కనిపించింది. కానీ రాజకీయాల్లో “ఖాయం” అనే పదానికి గడువు చాలా చిన్నది. చివరకు ఆ పదవిని భరత్ భూషణ్ చేతికి అప్పజెప్పారు చంద్రబాబు.
వాస్తవానికి భరత్ భూషణ్ పేరు రెండు వారాల కిందటే బయటకు వచ్చింది. ఆ సమయంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నియామకం సినీ పరిశ్రమలోని ప్రతిభ ఆధారంగా కాకుండా, రాజకీయ అనుబంధం ఆధారంగా జరిగాయని విమర్శలు వెలువత్తాయి. పవన్ చెప్పినట్లు ఏఎం రత్నం ఒకవిధంగా ఈ పదవికి అన్నివిధాల అర్హుడే. అయినా కూడా భరత్‌కే ఆ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. అదే సమయంలో ‘గరుడపురాణం’ శివాజీ, బుర్రా సాయిమాధవ్‌లాంటి వాళ్లకూ డైరెక్టర్లుగా నియమించారు.
సోదరుడైన పవన్ కళ్యాణ్ సూచనను గౌరవిస్తామని చెప్పడం .. చివరికి ఫైల్‌పై మరోలా సంతకం చేయడం చంద్రబాబు చేస్తోంది. బయటకు “అన్నదమ్ముల బంధం”లా కనిపించినా.. లోపల మాత్రం “సామాజిక సమీకరణాలు” ముఖ్యమని చంద్రబాబు నిర్ణయాలతో స్పష్టమవుతోంది. ఈ ఘటన తర్వాత జనసేన సోషల్ మీడియా వర్గాల్లో “సిఫార్సులు మనవి.. నిర్ణయాలు వారివి” అనే సెటైర్లు కూడా కనిపిస్తున్నాయి.

అయితే ఇదేం కొత్తది కాదు. కూటమిలో ఇలాంటివి గత రెండేళ్లుగా జరుగుతూనే వస్తున్నాయి. “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి” అనే మాట నిరూపిస్తోంది చంద్రబాబు తీరు. ఇప్పుడీ ఎఫ్‌డీసీ వ్యవహారంలోనూ అదే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజల్లో భారీ మద్దతు తెచ్చిన నాయకుడు కావచ్చు. కానీ అధికార యంత్రాంగంలో ప్రతి నిర్ణయం కాకపోయినా.. ఒకటో రెండో కూడా ఆయన మాట ప్రకారమే జరుగుతుందనే గ్యారంటీ లేదని ఈ ఎపిసోడ్ గుర్తు చేసింది. మరోవైపు చంద్రబాబు మాత్రం కూటమిలో తుది నిర్ణయాధికారం తన చేతిలోనే ఉందని సైలెంట్‌గా సంకేతం ఇచ్చినట్టయింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్క మాటే వైరల్ అవుతోంది.. “అహో సోదరా… రాజకీయ స్నేహం అంటే సినిమా ఫ్రెండ్‌షిప్ కాదురా!”.. అయితే
ఇంత హడావిడిలోనూ.. అటు పవన్ కళ్యాణ్‌తో ఎంతో నమ్మకంగా తీసిన సినిమా రిలీజ్‌కు ఇబ్బంది పడి, ఆపై అట్టర్ ఫ్లాప్ కావడంతో నిండా మునిగిపోయి ఉండి.. ఇప్పుడు ఇటు ఎఫ్‌డీసీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవడంతో “అయ్యో పాపం రత్నంగారూ” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


