యూపీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ‘బెంగాల్‌’ వ్యూహం.. అదుర్స్‌.. | BJP Rolls Out Caste And Regional Strategy In Uttar Pradesh Ahead Of 2027 Assembly Elections After West Bengal Victory | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ‘బెంగాల్‌’ వ్యూహం.. అదుర్స్‌..

May 10 2026 9:44 PM | Updated on May 11 2026 5:27 PM

 BJP Preps For UP Goes For Social Reset With Cabinet Reshuffle

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో అద్భుతమైన వ్యూహంతో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపై దృష‍్టి సారిస్తోంది. యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో 403 స్థానాలకుగానూ ఎన్నికలు జరగాల్సి ఉంది. భవిష‍్యత్తులో కేంద్రంలో విజయం సాధించాలంటే యూపీలో గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉంటాయి మరి. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే ఎలాంటి వ్యూహాల్ని అమలు చేస్తోందంటే?

పశ్చిమ బెంగాల్‌ వ్యూహాలనే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకునే పనిలో పడింది. బ్రాహ్మణ, జాట్‌, గుజ్జర్‌, లోధ్‌, పాస్వాన్‌, అత్యంత వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇచ్చేలా ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు చివరిసారి చేసిన మంత్రివర్గ విస్తరణగా దీన్ని చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం భూపేంద్ర చౌదరి, సమాజ్‌వాదీ పార్టీ తిరుగుబాటు నేత మనోజ్‌ పాండేలకు మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. రాష్ట్ర మంత్రులు అజిత్‌పాల్‌ సింగ్‌, సోమేంద్ర తోమర్‌లకు స్వతంత్ర హోదాతో రాష్ట్ర మంత్రులుగా పదోన్నతి ఇచ్చింది. కొత్తగా కృష్ణ పాస్వాన్‌, సురేంద్ర దిలేర్‌, హన్సరాజ్‌ విశ్వకర్మ, కైలాశ్‌ రాజ్‌పుత్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ విస్తరణ ద్వారా అసంతృప్త కులాలు, పార్టీ మారిన నేతలను సమతుల్యం చేయడంతో పాటు ప్రాంతీయ సమీకరణ సాధించే ప్రయత్నం చేసింది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ చాలా కాలంగా వాయిదా పడటంతో యూపీ బీజేపీ నేతలు, ఢిల్లీలోని అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ వర్గాలు అంతర్గత విభేదాలున్నాయన్న వార్తలను ఖండించాయి. పశ్చిమ బెంగాల్‌, అస్సాం ఎన్నికలపైనే పార్టీ దృష్టి ఉండటంతో ఆలస్యం జరిగిందని తెలిపాయి.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ఎన్నికల సమయంలోనే విస్తరణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా సంస్థాగత మార్పుల కోసం ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షుడు పంకజ్‌ చౌదరి ఆధ్వర్యంలో త్వరలో టీమ్‌ను ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

సామాజిక సమీకరణాలు
మంత్రివర్గ విస్తరణ ద్వారా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పలు ఓటు బ్యాంకులకు సంకేతాలు పంపింది. మనోజ్‌ పాండేకు మంత్రివర్గంలో చోటు ఇచ్చి బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది.

మనోజ్‌ పాండే, బృజేశ్‌ పాఠక్‌ల వంటి నేతలను మంత్రివర్గంలో కొనసాగించడం ద్వారా పెద్ద ఎత్తున ఉన్న బ్రాహ్మణ సమాజానికి సరైన సందేశం వెళ్తుందని పార్టీ భావిస్తోంది. యూజీసీ మార్గదర్శకాల వంటి అంశాల వల్ల ఆ వర్గం, భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పార్టీ అంచనా వేస్తోంది.

అలాగే భూపేంద్ర చౌదరిని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ జాట్‌ ప్రతినిధిగా, సోమేంద్ర తోమర్‌ను గుజ్జర్‌ల ప్రతినిధిగా, కృష్ణ పస్వాన్‌ను దళిత-పాసీ వర్గ ప్రతినిధిగా, సురేంద్ర దిలేర్‌ను వాల్మీకి వర్గ ప్రతినిధిగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు. లోధ్‌, విశ్వకర్మ వంటి వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. 

ఈ విస్తరణ ద్వారా యాదవేతర ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయాలకు మించి సూక్ష్మ సామాజిక వర్గాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందనే సంకేతం ఇస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లోతుపాట్లు పూడ్చే ప్రయత్నం చేస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్‌ సమీకరణలు 2024లో స్థిరంగా లేవు. దళిత ఓట్లలో పెద్ద భాగం ప్రతిపక్షాలవైపు వెళ్లింది. అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకర్షించే పీడీఏ నినాదం కూడా ప్రభావం చూపింది. ఈ సమస్యలను సరిచేయడమే విస్తరణ లక్ష్యంగా చెబుతున్నారు.

మిషన్‌ 2027
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద బలం యోగి ఆదిత్యనాథ్‌. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పరిపాలన ఒక్కటే విజయానికి సరిపోదని పార్టీ భావిస్తోంది. సామాజిక ప్రాతినిధ్యానికీ సమాన ప్రాధాన్యం ఇస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయం తర్వాత మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, ప్రాంతీయ ఆకాంక్షలకు బలమైన ప్రాతినిధ్యం ఇచ్చే మోడల్‌ మరింత బాగా పనిచేస్తుందని పార్టీ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధించే ప్రయత్నం కూడా చేస్తోంది.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పలువురు సీనియర్‌ మంత్రులు పూర్వాంచల్‌ ప్రాంతానికి చెందినవారు. ఈ సారి అవధ్‌, పశ్చిమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి జాట్‌, గుజ్జర్‌, పూర్వాంచల్‌ నుంచి రాజ్‌భర్‌, నిషాద్‌, మధ్య ఉత్తరప్రదేశ్‌ నుంచి కుర్మీ, పాల్‌ వర్గాల నేతలకు చోటు ఇచ్చి ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభత్వ వ్యతిరేకతపై పోరు
భారతీయ జనతా పార్టీ 2017 నుంచి అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత సమస్యగా మారే అవకాశం ఉంది. 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఊహించని విధంగా బీజేపీకి షాక్‌ ఇచ్చింది. ఎస్పీ భారీగా సీట్లు గెలుచుకుంది. 2027 ఎన్నికలపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలను బీజేపీ వాయిదా వేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చోటు ఇవ్వడం ద్వారా పార్టీ మారాలని భావిస్తున్న నేతలకు కూడా సంకేతం పంపింది. ఈ విస్తరణ కేవలం మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి మాత్రమే కాదు. 2027 అధికార పోరాటానికి కీలక వ్యూహంగా కూడా భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement