BJP MP Bandi Sanjay Meets Amit Shah In Delhi - Sakshi
Sakshi News home page

బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్‌షాతో కరీంనగర్‌ ఎంపీ భేటీ, కీలక సూచన

Jul 24 2023 2:39 PM | Updated on Jul 24 2023 3:37 PM

BJP MP Bandi Sanjay Meets Amit Shah In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు. ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.తెలంగాణ తాజా రాజకీయ అంశాలను అమిత్‌ షాకు బండి వివరించారు. గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు. అయితే పార్టీలో తన వర్గాన్ని పక్కన పెడుతున్నారంటూ బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి అందించిన సేవలను గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

దీనిపై స్పందించిన అమిత్‌షా.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, మీడియా ముఖంగా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడవద్దని బండికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి కోల్పోయిన అనంతరం కేంద్ర మంత్రిని బండి కలవడం ఇదే తొలిసారి కావడంతో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, బండి సంజయ్‌ తనను కలిసినట్లు అమిత్‌ షా స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను కరీంనగర్‌ ఎంపీతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కేంద్రమంత్రితో భేటీపై ఇటు బండి సంజయ్‌ సైతం ట్వీట్‌ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తానని తెలిపారు.
చదవండి: గగనతలంలో కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్‌

ఇదిలాఉండగా.. కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుల కారణంగానే తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారని బండి పరోక్ష విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, బహిరంగ వేదికలపై పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడటంపై బీజేపీ పెద్దలు ఆయనపై గుర్రుగా ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement