
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. మహిళా నేతలు గేట్లు ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివరాల ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.
మరోవైపు.. కాసేపటి క్రితమే బీజేపీ మహిళా మోర్చా నేతలు బీజేపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా నిరసనలకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు మీద నుంచి దూకి నిరసన తెలిపేందుకు బీజేపీ మహిళా నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
