తెరవెనుక బాగోతం నడిచింది | BJP leader Ponguleti Sudhakar Reddy On Buggapadu Food Park lands | Sakshi
Sakshi News home page

తెరవెనుక బాగోతం నడిచింది

Jun 18 2026 5:21 AM | Updated on Jun 18 2026 5:21 AM

BJP leader Ponguleti Sudhakar Reddy On Buggapadu Food Park lands

బుగ్గపాడు ఫుడ్‌పార్కు భూములను పరిశీలిస్తున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు

బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి  

బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌

సత్తుపల్లి: బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ భూములను ఎకరం రూ.40.47 లక్షలుగా నిర్ణయించి, రూ.21 లక్షలకే కేటాయించారంటే తెర వెనుక బాగోతం నడిచినట్టేనని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కో ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కు భూములను పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ ధరకు భూమి కేటాయింపులో అవినీతి, కుట్ర,  కుంభకోణం దాగి ఉందని, ఇదంతా ప్రభుత్వంలోని జిల్లాకు చెందిన ముఖ్యనేత కన్నుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. తక్కువ ధరకు కేటాయింపులనే వ్యతిరేకిస్తున్నామన్నారు.  

ఎవరి ప్రమేయంతో జరిగిందో చెప్పాలి? 
ఏపీకి చెందిన దీపక్‌ నెక్స్‌ట్‌ జెన్‌ కంపెనీకి 72 ఎకరాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో, కేబినెట్‌ అనుమతితో జరగాల్సిన భూకేటాయింపు అందుకు విరుద్ధంగా ఎవరి ప్రమేయంతో జరిగిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫుడ్‌పార్కు అభివృద్ధి నిధులు రూ.109 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.49.70 కోట్లు ఇచ్చిందని తెలిపారు. భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో దర్యాప్తు చేయించేలా కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన హైవేలోని వేంసూరు ఎగ్జిట్‌ వద్ద మొక్కలు నాటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement