మాది ఒంటరి పోరే: కిషన్‌రెడ్డి | BJP Leader Kishan Reddy Comments On Alliance With BRS Ahead Of Lok Sabha Elections, Details Inside - Sakshi
Sakshi News home page

మాది ఒంటరి పోరే: కిషన్‌రెడ్డి

Feb 20 2024 5:34 AM | Updated on Feb 20 2024 3:46 PM

BJP Leader Kishan Reddy Comments On Alliance with BRS - Sakshi

చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే ఉత్పన్నం కాదని, బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి తేలి్చచెప్పారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు పోటీచేసి మెజారిటీ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న బీజేపీ మునిగిపోయే నావ వంటి బీఆర్‌ఎస్‌తో కలిసే పరిస్థితి రాదని స్పష్టం చేశారు. గతంలో కూడా తామెప్పుడూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రచారాన్ని కొందరు దుర్మార్గులు పనిగట్టుకుని కుట్రపూరితంగా చేస్తున్నారని, మెడకాయ మీద తలకాయ లేనివాళ్లు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించొద్దని ఆయన కోరారు.

బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య పొత్తు ఉందని ఎవరైనా మాట్లాడితే వారి రెండు చెంపలు గట్టిగా వాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 20 (మంగళవారం) నుంచి రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో మొత్తం 5,500 కి.మీ మేర పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విజయసంకల్పయాత్ర’­పోస్టర్‌ను, యాత్ర షెడ్యూల్‌ను కిషన్‌రెడ్డి సోమవా­రం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అదేవిధంగా యాత్ర పాటను, స్టిక్కర్లు, కరపత్రాలను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 

నోటిఫికేషన్‌ వచ్చేలోగానే యాత్రలు పూర్తి... 
పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే లోగానే ఈ యాత్రలను పూర్తిచేస్తామని తెలిపారు. 20వ తేదీ నుంచి నాలుగుయాత్రలు సమాంతరంగా మొదలవుతాయని, మేడారం జాతర కారణంగా వరంగల్‌ వైపు సాగే యాత్ర మాత్రం కొన్నిరోజుల ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్రల్లో భాగంగా... రైతులు, చేతివృత్తులవారు, నిరుద్యోగులు, పొదుపుసంఘాల మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబు, నేతలు ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, డా.కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 



ఐదుయాత్రలు ఇలా... 
1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర...బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు 21 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ దీనిని ప్రారంభిస్తారు. ఎంపీ డా. కె.లక్ష్మణ్, ఆరుగురు శాసనసభ్యులు భైంసా యాత్రలో పాల్గొంటారు. 

2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర...కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ ప్రారంభిస్తారు. ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు. 

3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర... భువనగిరిలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌ గిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుంది. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభిస్తారు. ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రాజా సింగ్, వెంకటరమణా రెడ్డి పాల్గొంటారు. 
 
4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర...సమ్మక్క సారక్క జాతర కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,015 కి.మీ మేర 7 రోజుల పాటు 21 నియోజకవర్గాలను కవర్‌ చేసేలా ఈ యాత్ర ఉంటుంది. 
 
5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర...మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,440 కి.మీ మేర యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌ రెడ్డి పాల్గొంటారు. 
 
భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద యాత్ర రథాలకు కిషన్‌రెడ్డి పూజలు 
చార్మినార్‌: విజయ్‌ సంకల్ప యాత్ర రథాలకు సోమవారం కిషన్‌రెడ్డి.. ఈటెల రాజేందర్‌తో కలిసి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు, గుమ్మడి కాయలు కొట్టి ప్రారంభించారు. భారత్‌ మాతాకీ జై..నరేంద్ర మోదీకి జై..అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement