బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌ | Bihar election 2025 Phase 1: Key dates, constituencies and voting schedule | Sakshi
Sakshi News home page

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌

Nov 5 2025 9:25 PM | Updated on Nov 5 2025 9:40 PM

Bihar election 2025 Phase 1: Key dates, constituencies and voting schedule

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ షురూ అయ్యింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఎన్నికల ముఖ్యాంశాలు
మొదటి దశ పోలింగ్ తేదీ: నవంబర్ 6, 2025
ఓట్ల లెక్కింపు: నవంబర్ 14, 2025
మొత్తం నియోజకవర్గాలు: 243
మొదటి దశలో ఓటింగ్ జరిగే నియోజకవర్గాలు: 121
జిల్లాల సంఖ్య: 18
మొత్తం అభ్యర్థులు: 1,314
ఓటు హక్కున్న ఓటర్లు : 7.4 కోట్ల మంది
మొదటి సారి ఓటు వేయనున్న వారు: 14 లక్షల మంది ఉన్నారు. 

ఇక ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్‌ కుమార్‌ తనదైన శైలిలో జంగిల్‌రాజ్‌ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ  బిహార్‌ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్‌’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్‌ కుమార్‌ తన ‘ఈబీసీ, మహాదళిత్‌’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.

అందరి కళ్లూ చిరాగ్‌పైనే
ఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్‌ ఫ్యాక్టర్‌’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేస్తున్న చిరాగ్‌ పాశ్వాన్‌(ఎల్‌జేపీ–రామ్‌ విలాస్‌).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్‌జేపీ–రామ్‌ విలాస్‌ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా.  

ప్రభావిత అంశాలు  
ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది.  

15 ఏళ్ల నితీశ్‌ కుమార్‌ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా 
యత్నించింది.  ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్‌పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్‌తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. నితీశ్‌ కుమార్‌ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్‌రాజ్‌’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు.   నితీశ్‌ కుమార్‌ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి.  రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్‌ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement