తొట్ల‌కొండ‌కు ముప్పు: ఖండించిన అవంతి | Sakshi
Sakshi News home page

ఏం మాట్లాడతారో ప‌వ‌న్‌కే తెలియ‌దు: అవంతి

Published Mon, Aug 24 2020 2:48 PM

Avanthi Srinivas Criticise Chandrababu, Pawan Kalyan In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖ‌పట్నం: విశాఖప‌ట్నంలో రాష్ట్ర ప్రభుత్వం‌ నిర్మించనున్న స్టేట్ గెస్ట్ హౌస్‌కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి అవంతి శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. ఈ నిర్మాణం వల్ల‌ తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని, చంద్రబాబుతో పాటు కొన్ని‌ పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని‌ ఖండిస్తున్నామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖప‌ట్నంలో మంత్రి సోమ‌వారం‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్‌ల‌ నిర్మాణానికి ప్రభుత్వం‌ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర‌, విశాఖపై అడుగడుగునా విషం చిమ్ముతున్న చంద్రబాబు.. ఆయ‌న‌ హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని మండిప‌డ్డారు. ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కూడా..)

చంద్రబాబుకు దళితుల‌ గురించి మాడ్లాడే అర్హతే లేద‌ని మంత్రి అవంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమ‌ర్స్‌ ప్రమాదం జరిగినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించరని ఎద్దేవా చేశారు. మ‌రోవైపు పవన్ కల్యాణ్‌ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయ‌న‌కు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, గానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదా? అని నిల‌దీశారు. గాజువాక‌ ప్రజల‌ ఓట్లు వేయించుకుని విశాఖకి పరిపాలనా రాజధానిని పవన్ కళ్యాణ్ ఎలా వ్యతిరేకిస్తారన్నారు.

ఇక‌ తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతార‌ని రఘురామకృష్ణంరాజును ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర గురించి‌ మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని‌ మాట్లాడాలన్నారు. ఆయ‌న‌కు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామకృష్ణంరాజుకు అవంతి హిత‌వు ప‌లికారు. (చంద్రబాబుకు సామినేని సవాల్‌..)

Advertisement
Advertisement