
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి పలాయన మంత్రం జపించారు. శాసన సభ సమావేశాలు ఒక్క రోజు కాదు.. 15 రోజులు నిర్వహించాలని మంగళవారం జరిగిన టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో చంద్రబాబు డిమాండ్ చేశారు. సభను ఒక్క రోజు నిర్వహించడం ప్రభుత్వ పలాయన వాదానికి నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని కబుర్లు చెప్పిన అదే టీడీపీ.. తొలిరోజే సభలో పలాయనవాదమంటే ఏమిటో చూపించింది. 15 రోజులు సభ నడపాలని అడిగిన చంద్రబాబే తొలిరోజు సభకు రాలేదు. మిగతా సభ్యులూ మధ్యలోనే వెళ్లిపోయారు.
వాస్తవానికి శాసనసభను గురువారం ఒక్క రోజు నిర్వహించి.. డిసెంబర్‌లో పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తూ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించింది. గురువారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమవగానే ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేసి, బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశం తర్వాత సభ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ సమావేశానికి, ఆ తర్వాత సభకు కూడా హాజరుకాలేదు. మిగతా టీడీపీ సభ్యులు కూడా కొందరే వచ్చారు.
ముందుగా ‘మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’ అనే అంశంపై స్పీకర్ చర్చ చేపట్టారు. చర్చ ప్రారంభమైన సమయంలో టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత కె.అచ్చెన్నాయుడు సహా ఐదారుగురు ప్రతిపక్ష సభ్యులే సభలో ఉన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్న సమయంలోనే అచ్చెన్నాయుడు వెళ్లిపోయారు. చర్చలో ప్రతిపక్షం తరఫున కె.భవాని మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు ఒకరి వెంట మరొకరు సభ నుంచి వెళ్లిపోయారు. సీఎం జగన్ మాట్లాడే సమయంలో టీడీపీ సీట్లన్నీ ఖాళీగా కన్పించాయి. సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్ చేసి.. తొలి రోజే పలాయనం చిత్తగించారని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అభివర్ణిస్తున్నారు.