సాక్షి,చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన అనుచరులు కూడా తమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి అన్నామలైని ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.
ఇటీవల తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవి మార్పు, అనంతరం జరిగిన పరిణామాలపై అన్నామలై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి.
అన్నామలై కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నప్పటికీ.. ఆయన ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లేనని, అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మక్కల్ శక్తి ఖచ్చి (టీఎంఎస్‌కే)’గా వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బీజేపీ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. తమిళనాడులో కూడా నాయకత్వ మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో, ఈ నెల చివర్లో కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వదంతులు అన్నామలై కేంద్ర నాయకత్వం ముందు తన బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహమని ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం, నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్ వంటి సీనియర్ బీజేపీ నాయకుల ప్రభావం తగ్గిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అన్నామలై కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ స్థానంలో వనతి శ్రీనివాసన్‌కు అవకాశం ఇ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన అన్నామలై చివరికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని గానీ ఆశించే అవకాశంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.

రాజీనామా నిజమేనా?
అన్నామలై పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్‌కు తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న అన్నామలై, తన నిర్ణయాన్ని ఖరారు చేస్తూ నబిన్‌ను కలవనున్నారు.
ఇప్పటికే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ సమావేశం కోసమే కాకుండా తన ఆరేళ్ల రాజకీయ జీవితం పట్ల కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నన్నారని, ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనకు కల్పించిన అవకాశాలు, అనుభవాలు, రాజకీయ ప్రయాణానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.


