దక్షిణాదిన ఎమర్జెన్సీ సానుకూల ప్రభావం ఇందిరను గెలిపించింది! | Analyst merugumala nancharaiah On 1975 77 Emergency Time | Sakshi
Sakshi News home page

దక్షిణాదిన ఎమర్జెన్సీ సానుకూల ప్రభావం ఇందిరను గెలిపించింది!

Jun 20 2025 5:39 PM | Updated on Jun 20 2025 6:30 PM

Analyst merugumala nancharaiah On 1975 77 Emergency Time

 భారత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కుదిపివేసిన ఎమర్జెన్సీ ప్రకటనకు ఈ నెల 25న 50 ఏళ్లు నిండుతున్నాయి. అప్పుడు ఉత్తరాదితో పోల్చితే తన విలక్షణ స్వభావం ఏమిటో దక్షిణాది ప్రాంతం నిరూపించుకుంది. ఈ సందర్భంగా దానికి కారణాలు ఇక్కడ పరిశీలిద్దాం.

అత్యవసర పరిస్థితి అమలు జరిగిన తీరు దక్షిణాది రాష్ట్రాల్లో తర్వాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. దేశంలో 1975–77 నాటి ఎమర్జెన్సీ పర్యవసానాలు దక్షిణాది రాష్ట్రాలపై అతి స్వల్పం. ఈ వాస్తవాన్ని ఆత్యయిక స్థితిని తొలగించాక జరిపించిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి.  21 మాసాల అత్యవసర పరిస్థితి నిబంధనలను చాలా వరకు 1977 జనవరిలో తొలగించి మార్చిలో నిర్వహించిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని అధికార కాంగ్రెస్‌ ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, గుజరాత్, ఇంకా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి తూర్పు రాష్ట్రాల్లో ప్రతిపక్షమైన జనతాపార్టీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక మెజారిటీ సీట్లు కైవసమయ్యాయి. అయితే, నాటి దక్షిణాదిలోని అత్యధిక లోక్‌సభ స్థానాలను మాత్రం పాలకపక్షమైన కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి మిత్రపక్షాలతో కలిసి గెలుచుకుంది. జనతా, దాని మిత్రపక్షాలకు నామమాత్రంగా ఇక్కడ సీట్లు దక్కాయి. ఉత్తరాదిన జనతాపార్టీ, అకాలీదళ్‌ వంటి మిత్రపక్షాలు తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్నాయి.

దక్షిణాదిలో ఈ ప్రతిపక్షాలు ఎంతగా పోరాడినా కాంగ్రెస్‌ అప్రతిహత విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాలుగు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్‌ పార్టీకి  ఎదురులేని పరిస్థితి. తాను అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 సీట్లలో కాంగ్రెస్‌కు 41, కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగాను 26 స్థానాలు దక్కాయి. తెలుగునాట ఒక్క నంద్యాల స్థానంలోనే జనతాపార్టీ గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని తట్టుకుని అప్పటికి మాజీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఇలా నంద్యాల నుంచి గెలిచిన నీలం కొద్ది మాసాల తర్వాత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిత్రపక్షాల సహకారంతో అధికారంలో ఉన్న కేరళలోని మొత్తం 20 సీట్లలోనూ కాంగ్రెస్‌ కూటమే (యూడీఎఫ్‌) విజయం సాధించింది. తమిళనాడులో నాటి ప్రతిపక్షమైన అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ కూటమికి మొత్తం 39 సీట్లలో 34 కైవసమయ్యాయి. డీఎంకే నాయకత్వంలోని కూటమికి ఐదు సీట్లే దక్కాయి. 

బిహార్, గుజరాత్‌ ప్రజాందోళనలకు తోడు అలహాబాద్‌ హైకోర్టు తీర్పు
1971 ముందస్తు లోక్‌సభ ఎన్నికల్లో మూడింటి రెండింటి మెజారిటీతో కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరాగాంధీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌ యుద్ధంలో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్‌ గెలుపు ప్రధాని ఇందిరాగాంధీని ప్రతిష్ఠను ‘దుర్గా దేవి’ స్థాయికి తీసుకెళ్లింది. 1972 ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయాలు నమోదు చేసుకుంది. అయితే, రెండు సంవత్సరాలకే దేశ ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు చిమన్‌భాయ్‌ పటే ల్‌ (గుజరాత్‌), అబ్దుల్‌ గఫూర్‌ (బిహార్‌) దుష్పరిపాలనపై ఆ రెండు రాష్ట్రాల్లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మార్గదర్శకత్వంలో విద్యార్థి, యువజన ఉద్యమాలు జోరందుకున్నాయి. దీనికితోడు 1975 జూన్‌ 12 అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధాని ఇందిరను కోలుకోలేని విధంగా చేసింది. 1971లో యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఇందిర ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేసి స్టే సంపాదించారు. కాని, తీర్పు ఫలితంగా, యువజన ఉద్యమాల కారణంగా ఎదురైన ప్రజా ప్రతిఘటన, ప్రతిపక్షాల దూకుడును తట్టుకోవడానికి ఆమె 1975 జూన్‌ 25న దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర పరిస్థితి కారణంగా కేంద్ర సర్కారు ప్రాథమిక హక్కులు సహా, అనేక రకాల రాజ్యాంగ హక్కులను పక్కన పెట్టింది. పత్రికలపై సెన్సార్‌షిప్‌ విధించింది. అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌.కె.ఆడ్వాణీ, మొరార్జీదేశాయి, చంద్రశేఖర్‌ సహా లక్షలాది మంది ప్రతిపక్షనేతలను జైళ్లకు పంపారు. 


అరెస్టులు, ఆపరేషన్లు, పేదల ఇళ్ల తొలగింపు ఉత్తరాదిన ఎక్కువ
ఎమర్జెన్సీ కాలంలో కుటుంబ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆదేశాలను అడ్డగోలుగా అధికారులు అమలు చేశారు. ప్రాంతాల వారిగా సంతాన నిరోధక ఆపరేషన్లకు కోటాలు నిర్ణయించి కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లికాని యువకులకు సైతం పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేశారు. ఈ ఆపరేషన్లతో వేలాది గ్రామాల ప్రజలు భయోత్పాతానికి గురి అయ్యారు. అలాగే, దేశ రాజధాని న్యూఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో నగరాల సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. ఢిల్లీలోని తుర్క్‌మన్‌గేట్‌ ప్రాంతంలో ఇందిర రెండో కుమారుడు సంజయ్‌ గాంధీ అనుచరులైన రుక్సానా సుల్తానా వంటి నేతలు మైనారిటీలకు చెందిన వేలాది గృహాలను తొలగించే పనిని అధికారులతో చేయించారు.

పిల్లలు పుట్టకుండా చేసే వేసెక్టమీ ఆపరేషన్ల భయంతో ముస్లింలు, ఇతర వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇలాంటి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అన్నీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చేశారు. సామాన్య ప్రజానీకంపై దౌర్జన్యాలు, అత్యాచారాలు కూడా హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువ జరిగాయి. ప్రభుత్వ నిర్బంధంలో రాజకీయ కార్యకర్తలనేగాక సాధారణ ప్రజలను సైతం వేధించారు. ఎమర్జెన్సీలో ఈ రకమైన ప్రభుత్వ జులుం అంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే కనిపించింది. దీంతో హిందీ రాష్ట్రాలు సహా ఉత్తరాది అంతటా పరిస్థితి ఎమర్జెన్సీలో నివురుగప్పిన నిప్పులా ఉండేది. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ నిబంధనల అమలు ప్రభావం తక్కువ. ప్రతిపక్ష నాయకులను అరెస్టు వంటివి తప్ప రాజకీయ పక్షాల కార్యకర్తలు, సామాన్య ప్రజానీకంపై దమనకాండ, అణచివేత చర్యలు అతి స్వల్పం అని చెప్పవచ్చు. నాలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ప్రభుత్వం ప్రజల హక్కులు హరించి, హింసాయుత మార్గంలో పోరుకు సిద్ధమైన తీవ్రవాద పక్షాల కార్యకర్తలను ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు కాల్చిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో వందలాది ఎన్‌కౌంటర్లు
హోంశాఖా మంత్రిగా తెలుగునాట నక్సలైట్‌ ఉద్యమాన్ని చావుదెబ్బదీసిన ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఎమర్జెన్సీ కాలం 21 మాసాల్లో అధికారంలో ఉన్నారు. ఆయన హయాంలో తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో నక్సలైట్లను ఎదురుకాల్పుల పేరుతో ఎడాపెడా కాల్చిచంపారు. తర్వాత ఈ అత్యవసర పరిస్థితి దాష్టీకాలపై విచారణకు జస్టిస్‌ భార్గవ, విమదలాల్‌ కమిషన్లు వేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లు నిజమేనని ఈ కమిషన్ల నివేదికలు నిరూపించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ, పేద ప్రజలకు ఎమర్జెన్సీ వల్ల పెద్దగా కీడు జరగలేదు.

అరెస్టులు రాజకీయ నాయకులకే పరిమితమయ్యాయి. అంతేగాక, అనేకచోట్ల భారీ వడ్డీ వసూలు చేసే ఫైనాన్స్‌ వ్యాపారం, గ్యాబ్లింగ్‌ క్లబ్బులు లేకుండా చేయడం కాంగ్రెస్‌ సర్కారుకు సానుకూల పరిణామం. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కేరళలో అక్కడి కాంగ్రెస్‌ సర్కారు అణచివేత చర్యలు కాస్త ఎక్కువ. విద్యార్థి నాయకుడు రాజన్‌ను ప్రభుత్వ నిర్బంధంలో చంపడం సంచలనం సృష్టించింది కాని అక్కడ కూడా సామాన్య ప్రజలపై అంతగా దౌర్జన్యాలు జరగలేదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే సోషలిస్టు దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్‌ను బరోడా డైనమైట్‌ కేసులో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు.

అంతకు ముందు ఆయన ఆచూకీ చెప్పమని కోరుతూ జార్జి తమ్ముడు మైకేల్‌ ఫెర్నాండెజ్‌ను నిర్బంధంలోకి తీసుకుని వర్ణింపనలవి కాని రీతిలో శారీరక హింసకు గురి చేశారు. కవి, సినీ దర్శకుడు, ఫెర్నాండెజ్‌ సన్నిహిత మిత్రుడు, సోషలిస్టు అయిన తిక్కవరపు పఠాభిరామరెడ్డిని, ఆయన భార్య, సినిమా నటి కూడా అయిన స్నేహలతా రెడ్డిని నిర్బంధంలో హింసించారు. జైల్లో పెట్టిన చిత్రహింసల వల్ల స్నేహలత తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి కొన్ని సంఘటనలు మినహా నాయకులు, ప్రముఖులపై కాంగ్రెస్‌ ప్రభుత్వాల అణచివేత చర్యలు జనంపై దాదాపు లేవనే చెప్పవచ్చు. తమిళనాడులో కూడా ఉత్తరాదిలా మాదిరిగా ఎమర్జెన్సీ అత్యాచారాలు జరగలేదు. మొత్తంమీద ఈ నాలుగు రాష్ట్రాల్లో పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలపై అత్యవసర పరిస్థితి వ్యతిరేక ప్రభావం లేదు.

ఈ కారణాల వల్ల 1977 మార్చిలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. లోక్‌సభతోపాటే కేరళ అసెంబ్లీలోని మొత్తం 140 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌ 111 సీట్లతో తిరుగులేని ఘన విజయం సాధించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎమర్జెన్సీ తొలగించిన ఏడాది తర్వాత 1978 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌–ఐ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించింది. తెలుగునాట మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్‌–ఐ 175, కర్ణాటకలోని మొత్తం 224 సీట్లలో 149 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది.

దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ దుష్ప్రభావం లేదని, అక్కడ ప్రభుత్వాల అణచివేత చర్యలు సాగలేదని 1977 పార్లమెంటు, 1978 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూటిగా తేల్చిచెప్పాయి. ఎమర్జెన్సీ విధించి అప్రతిష్ఠపాలైన ఇందిరాగాంధీకి దక్షిణాది ఇలా కంచుకోటలా నిలిచింది. ‘‘దశాబ్దాలపాటు కేంద్రం నుంచి సవతి తల్లి ప్రేమనే పొందిన దక్షిణాది అత్యవసర పరిస్థితి కాలంలో సానుకూల పర్యవసనాలనే చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి శుభ పరిణామాలు దక్షిణాదిన ఎన్నడూ జరగలేదు,’’ అని ఇందిరకు సన్నిహితుడైన మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్‌ తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్య వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించింది.
–నాంచారయ్య మెరుగుమాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement