అప్పు విషయంలో ఘర్షణ.. కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

అప్పు విషయంలో ఘర్షణ.. కత్తితో దాడి

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

జ్యోతినగర్‌: రుణం తిరిగి చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీ పీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధి మల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన చిరంజీవిపై నక్క నగేశ్‌ కత్తితో దాడి చేయగా, అతడిని తప్పించేందుకు సహకరించిన మధును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిరంజీవికి రుణం ఇప్పించే విషయంలో నగేశ్‌ మధ్యవర్తిగా వ్యవహరించాడు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని నగేశ్‌ కోరడంతో శుక్రవారం రాత్రి మల్కాపూర్‌ ప్రాంతంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో నగేశ్‌ కత్తితో చిరంజీవిపై దాడి చేశాడు. ఘటనపై చిరంజీవి భార్య పొన్నం స్వప్న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నక్క నగేశ్‌, మధును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెంకట్‌స్వామి తెలిపారు.

వరకట్న వేధింపులకు వివాహిత బలి

కోనరావుపేట(వేములవాడ): వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ, మల్లయ్య దంపతుల కూతురు రేణుక(30)ను బావుసాయిపేటకు చెందిన గెంటె ప్రశాంత్‌కు 15 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి పిల్లలు లేరు. రేణుక వ్యవసాయ పనులకు వెళ్తుండగా, ప్రశాంత్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలలుగా భర్తతోపాటు అత్త కొమురవ్వ, ఆడబిడ్డ పద్మ అదనపుకట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. వేధింపులు భరించలేక శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. మృతురాలి సోదరి గడ్డం మమత ఫిర్యాదుతో సీఐ రవీందర్‌, ఎస్సై రామ్మోహన్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాంధీజయంతి రోజున నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కళాశాలకు చెందిన బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎన్‌.శాలిని వ్యాసరచన పోటీలో ద్వితీయస్థానం సాధించి, రూ.6,000 నగదు బహుమతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఎ.త్రిలోచన్‌ వ్యక్తిత్వ పోటీలో కన్సోలేషన్‌ బహుమతిని అందుకున్నాడు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ మనోహర్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లు నితిన్‌, రాజయ్య పాల్గొన్నారు.

గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బాస లింగయ్య(55) గుండెపోటుతో మృతిచెందాడు. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో విధులు నిర్వహించే లింగయ్య ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన ముగిసిన అనంతరం వివిధ పనులు చేయిస్తుండగా బుధవారం రాత్రి గుండెనొప్పి వచ్చింది. వెంటనే కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. లింగయ్యకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement